శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట…


వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు :
– శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట
– అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి జరుగనున్నా నేప‌థ్యంలో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో గురువారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివ‌రాలు ఇవి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

– సెప్టెంబర్‌ 27 నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తాం.

– కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటి పిల్లల త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చే అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేశాం.

– బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

– తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ ప్రారంభమవుతుంది. మిగతా రోజుల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తాం.

అఖండ హరినామ సంకీర్తనం పునఃప్రారంభం

– కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనం కార్యక్రమం ఆగస్టు 1న తిరుమలలో తిరిగి ప్రారంభమైంది. 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించింది.

– 7500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు నమోదు చేసుకున్నారు. కళాకారులకు కంప్యూటరైజ్డ్‌ విధానం ద్వారా ప్రదర్శనకు అవకాశం కల్పించి వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.

రోగుల కోసం బర్డ్‌ ఆసుపత్రిలో మరో 100 పడకలు

– బర్డ్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మూడు వార్డులను అభివృద్ధి చేసి రోగుల కోసం మరో 100 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

తిరుపతిలోనూ కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌

– తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ విధానాన్ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లోను అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.

శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

– శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ స్వామివారికి నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా నెల్లూరులోని ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

– వైభవోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం అన్నప్రసాదాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

– తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమై, 10వ తేదీన పూర్ణాముతితో ముగిశాయి.

తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు

– శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా నిర్వహించాం.

తిరుమలలో పర్వదినాలు

– ఆగస్టు 19న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.

– ఆగస్టు 20న శ్రీవారి ఆలయం వద్ద ఉట్లోత్సవం.

– ఆగస్టు 30న వరాహ జయంతి.

– ఆగస్టు 31న వినాయక చవితి.

తిరుపతిలో…

– టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ప్రముఖ స్వామీజీలు విచ్చేసి భజన మండళ్ల సభ్యులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబిసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

జూలై నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.40 లక్షలు

హుండీ :

– హుండీ కానుకలు ` రూ.139.33 కోట్లు

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.07 కోట్లు

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 53.41 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 10.97 లక్షలు

ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
———————————————————–
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.