రాఖీ పౌర్ణమి..పరమపావనమైన మహాపర్వం పూర్ణిమ.


పరమపావనమైన మహాపర్వం పూర్ణిమ. అందునా శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమ అత్యంత విశేషము గనుకనే దీనిని మహాశ్రావణి అని వ్యవహరిస్తారు. ఈ పూర్ణిమ నాడు జగద్గురువైన నారాయణుడు హయగ్రీవ స్వామిగా అవతరించాడు. అందుకని శ్రావణపూర్ణిమని హయగ్రీవ జయంతి అని వ్యవహరిస్తారు. హయగ్రీవుడు ఆద్యావతారము అని చెప్పబడుతున్నది.
శ్రావణ పౌర్ణమి నాడువిధిగా నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలి. అందువల్లనే ఈ పౌర్ణమికి జంధ్యాల పున్నమి అని కూడా పేరు. కొత్తగా ఉపనయనం చేసుకున్న బాలవటువులకు, బ్రహ్మచారులకు అధ్యయన నిష్ఠను పెంపొందించే ఉపాకర్మ ఉత్సవం. ఉపాకర్మ వేదాలను అధ్యయనం చేయానికి అనివార్యమైన ప్రారంభ సంస్కారం. ఈ సంస్కారం పొందిన వతువులు బహుళ విదియ నాడు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. వేద అధ్యయనం – నేర్చుకొనుట – వేద అధ్యాపనం – నేర్పించుట – సమాజానికి సమగ్ర రక్షణనిచ్చే సనాతన మాధ్యమం!
మన జాతీయతకు, మనుగడకుమౌలికమైన ప్రాతిపాదిక సంస్కారాల సమాహారమైన సంస్కృతి! వేదవిజ్ఞానం సంస్కారాల సమాహారం!
సంస్కారాలను రక్షించుకొనడమే రక్షాబంధన మహోత్సవం. తాను ఒక్కడు పొందడం అనుభవించడం మాత్రమే కాక తన సమాజంలోని ఇతరులకు తనకున్న దానిని పంచిపెట్టడం నిజమైన రక్షణ! శక్తి, విజ్ఞానం, ధనం, సంప్రదాయం, సౌశీల్యం..ఇలా ‘సమగ్రత్వం’లోని వివిధ సంస్కారాలను కలసి మెలసి సమిష్టిగా అనుభవించడం కుటుంబజీవనం.
కుటుంబ జీవికి ‘విస్తృతి’ జాతీయ సమాజం! వసుధ మొత్తం ప్రపంచం మొత్తం – ఒకే కుటుంబమన్న సంస్కారాన్ని ‘వేదం’ప్రసాదించింది. ఒక్కరే కాక ఇద్దరు కలసి తినడం – సహనౌ భునక్తు – ఈ ధరిత్రీ కుటుంబభావనకు ప్రాతిపదిక! కలసి తినడం, కలసి వినడం, కలసి చదవడం, కలసి ఉద్యమించడం, కలసి ఉద్యోగించడం, ఇవన్నీ సంస్కారాలు. ఈ సంస్కారాలకు ‘రక్షణ’ రక్షాబంధన మహోత్సవ లక్ష్యం!
శ్రావణ పూర్ణిమ నాడు జరిగే ఈ ఉత్సవం సనాతనమైన సంస్కారం.
‘కుటుంబం’లోని సోదరీ సోదరుల వలె ‘భూమి తల్లిగా ఆకాశం తండ్రి’గా ఉన్న విస్తృత కుటుంబ సభ్యులు పరస్పరం రక్షించుకోనాం వేదద్రష్టలు మనకు ప్రసాదించిన జాతీయ సంస్కారం! అనాదిగా మనమంతా భరతభూమి బిడ్డలం. ఈ ‘సంస్కార సమాహారం’తో మనం శోభించినప్పుడు వరాల బిడ్డలం కాగలము. శ్రావణ పౌర్ణమి నాడు పరస్పరం ‘రక్షా’ –రాఖీలు కట్టుకోవడం ఈ సంస్కారాలను పరిరక్షించి పెంపొందించి ప్రపంచానికి పంచాలన్న శుభ సంకల్పం. #🇮🇳 మన దేశ సంస్కృతి