వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పత్రాలు పంపిణీ..


భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పథకం ద్వారానే సాధ్యమని రెవెన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి అన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో గురువారం ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు,తాసిల్దార్ జి.లక్ష్మీపతి,వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఎనమదల నాగేశ్వరరావు,గ్రామ సర్పంచ్ వనం చిన్నావతి జార్జ్ బాబు ఆధ్వర్యంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు రక్షణ పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ డ్రోన్లు,కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు,జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే ప్రారంభించిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఈ భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించవచ్చునని,5 సెంమీ లేదా అంతకంటే తక్కువ ఖచ్చితత్వంతో జియో–రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు.సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీచేసి గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి,మ్యాపులు(భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు.అనంతరం భూ యజమానులకు భూ రక్షణ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ జానకి రాఘవ, పంచాయతీ కార్యదర్శి అయ్యన్న, ఉప్పలపాటి వీర్రాజు,కమ్మ సతీష్,సచివాలయం సిబ్బంది,రైతులు,తదితరులు పాల్గొన్నారు.