మృత్యుముఖం దిశగా చైనా!


*కఠిన ఆంక్షల సడలింపుతో విజృంభించనున్న కొవిడ్‌*

*13-21 లక్షల మరణాలు.. 84 కోట్ల కేసులు?*

**ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్‌*

*లండన్‌ : కఠిన కొవిడ్‌ ఆంక్షలను (జీరో-కొవిడ్‌ విధానం) సడలించిన చైనాలో మహమ్మారి విలయతాండవం తథ్యమని, భారీఎత్తున మరణాలు సంభవిస్తాయని వివిధ శాస్త్రీయ విధానాల ద్వారా నిపుణులు అంచనా వేస్తున్నారు. డ్రాగన్‌ అతిపెద్ద కొవిడ్‌ ఉద్ధృతిని ఎదుర్కోనుందని, కోట్ల మంది మహమ్మారి బారిన పడతారని, లక్షల మంది చనిపోతారని విశ్లేషిస్తున్నారు.*

*60% ప్రజలకు కొవిడ్‌ : బ్రిటన్‌కు చెందిన సైన్స్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ ‘ఎయిర్‌ఫినిటీ’ విశ్లేషణను ఉటంకిస్తూ గతవారం ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైన కథనం మేరకు- చైనాలో నిబంధనలను సడలించిన తర్వాత 13లక్షల నుంచి 21లక్షల మంది వరకు మృత్యువాత పడే అవకాశం ఉంది. అయితే మృతుల సంఖ్యకు సంబంధించిన అంచనాలు.. వయోధికులు, దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సరైన సమయంలో టీకాలు వేయడం, యాంటీవైరల్స్‌ లభ్యత తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయని ‘లాన్సెట్‌’ పేర్కొంది. నిబంధనలను సడలించిన అనంతరం వచ్చే కరోనా వేవ్‌లో చైనా జనాభాలో 60% (దాదాపు 84 కోట్లు) మంది మహమ్మారి బారినపడే అవకాశం ఉందని ‘చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ ఫెంగ్‌ ఝిజియాన్‌ అంచనా వేసినట్లు తెలిపింది.*

*అమెరికాలో 10 కోట్లు దాటిన కేసులు : కరోనా బెడద మొదలైనప్పటి నుంచి అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 10 కోట్లు దాటిందని జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ ప్రకటించింది. ఇప్పటివరకు 10.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.*

*ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్‌*

*చైనాలో ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి అత్యంత ఘోరంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పేషెంట్లు వెల్లువలా ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. వారికి వైద్యం అందించలేక డాక్టర్లు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒక పక్క ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసిపోతుంటే మరోవైపు వారికి చికిత్స అందించలేక సొమసిల్లిపోతున్నారు డాక్టర్లు. అచ్చం అలానే చైనాలోని ఒక డాక్టర్‌ అప్పటి వరకు పేషెంట్లకు చక్కగా వైద్యం అందించాడు. అంతే హఠాత్తుగా రోగుల ముందే వైద్యం చేస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వైద్యుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలోని దృశ్యాలు కంటతడి పెట్టించేలా అత్యంత ఘోరంగా ఉన్నాయి.*