సామాన్య భక్తులు పొందే గదుల అద్దె పెంచలేదు..
– రూ.120 కోట్లతో రూ.50/- రూ.100/- అద్దె గదుల ఆధునీకరణ
– రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం
విఐపిలు బస చేసే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేశాం
టిటిడిపై దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మకండి
మీడియా సమావేశంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులు బస చేసే రూ.50/-, రూ.100/- అద్దె గదులను రూ.120 కోట్లతో ఆధునీకరించామని, వీటి అద్దె ఏమాత్రం పెంచలేదని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. విఐపిల కోసం కేటాయించే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే నారాయణగిరి, ఎస్వీఆర్‌హెచ్, స్పెషల్ టైప్ విశ్రాంతి గృహాలను ఆధునీకరించి తగిన అద్దె నిర్ణయించామని తెలియజేశారు. అయితే సామాన్య భక్తులపై అధిక భారం మోపారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో మొత్తం 7500 గదులు ఉన్నాయని, వీటిలో సామాన్య భక్తుల కోసం రూ.50/-, రూ.100/- అద్దెగల గదులు సుమారు 5 వేల వరకు ఉన్నాయని, ఇటీవల ఈ గదుల్లో గీజర్, ఫర్నీచర్, ఫ్లోరింగ్ తదితర ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు. వీటిని భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ఇందుకోసం విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులకుగాను రోజుకు రూ.250/- వ్యయం అవుతోందని చెప్పారు. కాగా, సామాన్య భక్తుల కోసం రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మిస్తున్నట్టు తెలిపారు.
విఐపిలకు కేటాయించే నారాయణగిరి-1, 2, 3, 4 విశ్రాంతి గృహాలు, ఎస్వీఆర్‌హెచ్, స్పెషల్ టైప్, వివిఆర్‌హెచ్ విశ్రాంతి గృహాల్లోని మొత్తం 170 గదులను గీజర్, ఎసి, ఉడెన్ కాట్, దివాన్ తదితర వసతులతో రూ.8 కోట్లతో ఆధునీకరించినట్టు ఈవో తెలిపారు.
ఆగమశాస్త్రం ప్రకారమే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : ఈవో
విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ వైష్ణవాలయాల్లో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించవచ్చని దేశవ్యాప్తంగా ఉన్న 32 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు తెలియజేశారని, తద్వారా ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగలిగారని తెలిపారు. అయితే, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి కమర్షియల్ చేశారని టిటిడి మాజీ ఛైర్మన్ ఆరోపించడం భావ్యం కాదన్నారు. అవసరమైతే మఠాధిపతులతోపాటు పండితుల కమిటీ సమర్పించిన నివేదికను కూడా వారికి పంపుతామని చెప్పారు.
మీడియా సమావేశంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీనరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, రిసెప్షన్ డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్ పాల్గొన్నారు.
ఆధునీకరించిన గదులను మీడియాకు చూపిన ఈవో :
మీడియా సమావేశం అనంతరం ఈవో ఎస్‌ఎంసి, నారాయణగిరి విశ్రాంతి గృహాలు, స్పెషల్ టైప్ విశ్రాంతి గృహాల్లో ఆధునీకరించిన గదులను మీడియాకు చూపారు. అక్కడి సౌకర్యాల గురించి వారికి వివరించారు.
అనంతరం టిటిడి తిరుమల, తిరుపతిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను, చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ఈవో వివరించారు.
తిరుమలలో భక్తులకు సౌకర్యాలు :
– తిరుమలకు చేరుకున్న సామాన్య భక్తులకు ఐదు పిఎసిల్లో దాదాపు 7400 లాకర్లలో సుమారు 15 వేల మందికిపైగా భక్తులకు టిటిడి ఉచితంగా బస కల్పిస్తోంది. ఉచితంగా గదులు, హాళ్ళు, లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతి కల్పించడం జరిగింది. ఇక్కడే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తున్నాము. వేడి నీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది.
– భక్తులకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నాము. ఇక్కడ రోజుకు లక్ష మంది ఉచితంగా భోంచేస్తున్నారు.
– తాము బస చేసిన ప్రాంతాల నుంచి అన్నప్రసాద భవనానికి రాలేని వారికోసం వారికి సమీప ప్రాంతాల్లోనే ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు రెండు పూటలా ఉచితంగా అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేస్తున్నాము.
– సామాన్య భక్తుల సదుపాయం కోసం ఇటీవలే పాత అన్నదానం భవనంలో కూడా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన పేదలైనా, ధనికులైనా పైసా ఖర్చులేకుండా కడుపునిండా ఆహారం తీసుకునే సౌకర్యం నిరంతరాయంగా అమలు జరుగుతోంది. దీంతో పాటు భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో కూడా నిరంతరాయంగా తాగునీరు, పాలు, టిఫిన్, అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది.
– తిరుమలలో భక్తుల సంచారం ఉన్న అన్ని ప్రాంతాల్లో, నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లలో జలప్రసాదం కేంద్రాలు ఏర్పాటుచేసి సురక్షితమైన ఆర్‌ఓ తాగునీటిని భక్తులకు ఉచితంగా అందించడం జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్వహిస్తున్నాము.
– తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సు కంపార్ట్‌మెంట్లలోని డిస్పెన్సరీల ద్వారా ఉచితంగా వైద్యసేవలు, మందులు అందిస్తున్నారు. అదేవిధంగా అపోలో కార్డియాక్ సెంటర్ ద్వారా గుండె సంబంధిత అత్యవసర వైద్యసేవలను భక్తులకు అందిస్తున్నాము.
– కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో భక్తులకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా తలనీలాలు సమర్పించుకునే వ్యవస్థను నిర్వహిస్తున్నాము.
– భక్తులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఉచితంగా వెళ్లేందుకు బస్సులు నడపడం జరుగుతోంది.
– వృద్ధులు, నడవలేని వారి కోసం బ్యాటరీ వాహనాలు ఉచితంగా నడుపుతున్నాము.
– స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఒకరికి ఒకటి చొప్పున ఒక కుటుంబం నుంచి ఎంతమంది వస్తే అన్ని లడ్డూలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది.
– వీటితో పాటు రూ.50, రూ.100 కనీస అద్దెకే గీజర్, మంచం, పరుపు ఉండే గదులు వసతి కోసం కేటాయిస్తున్నాము.
– ఉచితంగా లగేజి, సెల్‌ఫోన్ డిపాజిట్ కేంద్రాలు నిర్వహిస్తున్నాము. ఇందుకోసం సంవత్సరానికి రూ.30 కోట్ల వ్యయం అవుతోంది.
– ఈ సదుపాయాలన్నీ తెలిసిన లక్షలాదిమంది సామాన్య భక్తులు తిరుమలలో వసతి, రవాణా, భోజనం, తలనీలాల సమర్పణ, దర్శనం, లడ్డూ ప్రసాదం అన్నీ ఉచితంగానే పొంది స్వామివారిని దర్శించుకుని వెళుతున్నారు.
తిరుపతిలో భక్తులకు సౌకర్యాలు :
– తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య, మధ్యతరగతి వర్గాలు తిరుపతిలో కాలు పెట్టినప్పటి నుంచి స్వామివారి దర్శనం అయ్యే వరకు అన్ని వసతులు టిటిడి ఉచితంగానే అందిస్తోంది.
– తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో దిగిన సామాన్య భక్తులకు రైల్వే స్టేషన్ వెనకాల ఉన్న శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత వసతి, అన్న ప్రసాదాలు అందించడం జరుగుతోంది.
– ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం సముదాయంలోని హాళ్లలో ఉచితంగా ఉండే సదుపాయం. ఇక్కడ కూడా అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది.
– తిరుమలకు నడచి వెళ్ళే భక్తుల కోసం తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్టీసి బస్టాండ్ నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల వరకు ఉచిత బస్సులు నడుపుతున్నాము.
సామాజిక సేవా కార్యక్రమాలు :
– సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న టీటీడీ మానవ సేవ కూడా మాధవ సేవే అనే విషయాన్ని ఆచరణలో చూపుతూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో ఉదాహరణకు కొన్ని మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది.
– బర్డ్, స్విమ్స్, ఆయుర్వేద, చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రులు నిర్వహించడం జరుగుతోంది. వీటిద్వారా నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన లక్షలాది మంది రోగులు ఉచిత, రాయితీలతో మెరుగైన వైద్యసేవలు, శస్త్ర చికిత్సలు పొంది కోలుకున్నారు.
– చిన్న పిల్లలకు ఉచితంగా ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవడం కోసం సుమారు 320 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది.
– వృద్ధులకు వృద్ధాశ్రమమం నిర్వహిస్తున్నాము.
– పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన సుమారు 20 వేల మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచిత విద్యను అందించడం జరుగుతోంది. ఇదేకాకుండా పలు యూనివర్సిటీలకు విద్యా ప్రమాణాలు పెంపు కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. హాస్టళ్లలో ఉచితంగా భోజనం అందిస్తున్నాం.
– కరోనా లాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రజలను ఆదుకోవడానికి విరివిగా సహాయం చేస్తున్న చరిత్ర టీటీడీది.
ఇవికూడా చేశాం…
– సామాన్య భక్తులకు ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించడం కోసం ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేశాము.
– బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి దర్శనాల సమయంలో విఐపి దర్శనాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా ఎక్కువమంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాము.
– గిరిజన, దళిత, బలహీనవర్గాల గ్రామాలకు చెందిన వేలాది మంది పేదలకు ఉచిత రవాణా, వసతి, భోజనం సదుపాయాలు కల్పించి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి దర్శనం చేయించాము.
———————————————————–
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.