టిటిడి ధార్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమించాలని నిర్ణయం
టిటిడి ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డిపిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఛైర్మన్ ఆధ్వర్యంలో హెచ్‌డిపిపి, ఎస్‌విబిసి కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతరం టిటిడి ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ ఆయా సమావేశాలలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను వివరించారు.
– గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలి.
– గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందించాలి.
– మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలి.
– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టిటిడి మూడు సంవత్సరాల నుండి వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది కావున, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించింది.
ఎస్వీబీసీ బోర్డు నిర్ణయాలు:
– ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ ఉన్నందున ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించాలి.
– దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండి తిరుమలకు వాహనాల్లో, నడక మార్గాల ద్వారా విచ్చేస్తున్న భక్తుల యాత్రానుభవాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయాలి.
– యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి, “అదివో అల్లదివో” వంటి కార్యక్రమాలు కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రసారం.
– ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేకమైన భక్తి కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయాలి.
– టిటిడి అందిస్తున్న ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను సాధారణ ప్రజలకు తెలిసేలా స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యకలాపాలను ప్రసారం చేయాలి. అలాగే పలు వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలను నిపుణులైన డాక్టర్లతో ఇప్పించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలి.
కార్యనిర్వాహక కమిటీల సభ్యులు శ్రీ విశ్వనాథ్, శ్రీమతి మల్లీశ్వరి, శ్రీ రాములు, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు