వివేకా హత్య విషయం మొదట తెలిసింది వాళ్లిద్దరికే: సజ్జల


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. హత్య అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి కాల్స్ అందుకున్నట్టుగా భావిస్తున్న సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను సీబీఐ నేడు విచారించింది.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి తర్వాత నవీన్ ను నోటీసులు ఇచ్చారని, దాంతో నవీన్ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. హత్య విషయం మొదటగా తెలిసింది వివేకా అల్లుడు, బావమరిదికేనని సజ్జల వెల్లడించారు.

వివేకా హత్యకు గురైన విషయం ఆయన బావమరిది ద్వారా అవినాశ్ రెడ్డికి తెలిసిందని… ఈ విషయాన్ని సీఎం జగన్ కు చెప్పేందుకు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి ఉంటాడని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా విషయం తెలియజేయాలన్నా ముందు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సిందే కదా అని సజ్జల వ్యాఖ్యానించారు.

వివేకా మృతి అనుమానాస్పదంగా ఉందని తెలుస్తున్నా… వివేకా అల్లుడు, బావమరిది ఎందుకు పోలీసులకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు.