టైప్ 1 మధుమేహం చాలావరకు చిన్న వయసులోనే దాడిచేస్తుంది…
క్లోమగ్రంథి ఇన్సులిన్ హార్మోన్‌ను తయారుచేయకపోవటం వల్ల తలెత్తే టైప్ 1 మధుమేహం చాలావరకు చిన్న వయసులోనే దాడిచేస్తుంది. పెద్దవారిలో రావటం అరుదు. పదేళ్లలోపే మదుమేహం దాడి చేసినట్టయితే అది టైప్1 మధుమేహమే. అందులో సందేహమేమీ లేదు. 10-35 ఏళ్ల వయసువారిలో దాదాపు సగం మందికి టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశముంది. ఇలాంటి మధుమేహానికి ఇన్సులిన్ తీసుకోవటం తప్పించి మరో మార్గం లేదు. అయితే మధుమేహంతో బాధపడే పిల్లలకు.. ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఆహార నియమాలు పెట్టకూడదనే సంగతిని గుర్తించాలి. మధుమేహం లేని పిల్లలకు ఇచ్చేటువంటి ఆహారమే వీరికీ ఇవ్వాలి. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం ఇవ్వటం తప్పనిసరి. లేకపోతే పోషణలోపం తలెత్తి ఎదుగుదల దెబ్బతినే ప్రమాదముంది. అయితే ఆహారం తీసుకునే సమయం, తినే పరిమాణాన్ని బట్టి రక్తంలో గ్లూకోజు స్థాయులు మారిపోతుంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఇన్సులిన్ మోతాదులను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక పదేళ్లు దాటిన తర్వాత కౌమార దశకు వచ్చేవరకు బరువు పెరగకుండా చూసుకోవటం ముఖ్యం. ఎత్తు, వయసుకు అనుగుణంగా ఆహారం తీసుకుంటూ బరువు ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువైతే అధిక రక్తపోటు, కిడ్నీ వడపోత సామర్థ్యం పడిపోవటం వంటి సమస్యలు త్వరగా ముంచుకొచ్చే ప్రమాదముంది. ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఆయా నిష్పత్తుల్లో ఉండేలా కూడా చూసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం, పరిమాణం, రక్తంలో గ్లూకోజులను బట్టి ఇన్సులిన్ మోతాదులు మార్చుకోవాల్సి ఉంటుంది. కౌమారదశలో (13-17 ఏళ్లు) హార్మోన్ల హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మగ పిల్లల్లో కన్నా ఆడ పిల్లల్లో ఎక్కువ. వీరిలో ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. అందువల్ల ఇన్సులిన్ మోతాదులను పెంచాల్సిన అవసరముంటుంది. టైప్ 1 మధుమేహం గల పిల్లల్లో (18 ఏళ్లలోపు) కొన్ని సమయాల్లో- జ్వరం, వాంతులు, విరేచనాల వంటి వాటితో నీటిశాతం తగ్గిపోయే పరిస్థితుల్లో రక్తంలో అసిటోన్ వంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఇది ప్రమాదకర పరిస్థితి. ఇలాంటి వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. టైప్ 1 మధుమేహంలో వ్యాయామం మూలంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలోకి రాకపోవచ్చు గానీ ఇతరత్రా జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. అందువల్ల వ్యాయామం చేయటం కూడా మంచిది.