ఈ దున్న ఖరీదు రూ. 4 కోట్లు…
అవును.. ఈ దున్నను చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకి వెళ్లాలి. దీనికి ఓ వ్యాపారి అక్షరాలా రూ.4కోట్ల రూపాయలు ఇస్తానన్నాడని యజమాని మున్నాసింగ్ సగర్వంగా చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం సాధారణ ధరకే మున్నాసింగ్ ఈ దున్నను కొనుగోలు చేశాడు. హీరా అని పేరు పెట్టుకుని అపురూపంగా పెంచాడు. బ్రీడింగ్ కోసం ఈ దున్న దగ్గరికి తీసుకొచ్చిన గేదెలకు ఆరోగ్యకరమైన దూడలు పుడుతున్నాయి. పెయ్య ఎక్కువ పాలిచ్చే గేదెలుగా తయారవుతున్నాయి. దాంతో హీరా పేరు పరిసర గ్రామాల్లో మార్మోగిపోయింది. గ్రామాలనుంచి పాడి రైతులు తమ గేదెలతో మున్నాసింగ్ ఇంటి వద్ద క్యూ కడుతున్నారు. అందుకు వాళ్లు లక్షల రూపాయలు వెచ్చించడానికీ ముందుకు రావడం గమనార్హం.
మున్నాసింగ్ హీరాని ఇంట్లో మనిషిగా చూసుకుంటాడు. రోజూ 3,4 కి.మీ. వాకింగ్‌కు తీసుకెళ్తాడు. నెలకు పాతిక, ముప్పై వేల ఖరీదు చేసే ఆహారం ఇస్తాడు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం హీరాని చూడడం కోసం తమ గ్రామం వస్తుంటారని, పశుసంవర్థక శాఖ అధికారులు సైతం హీరా పట్ల ఆసక్తి చూపుతున్నారని మున్నాసింగ్ చెప్పాడు.