బాలుడు రాసిన లేఖకు స్పందించిన రాష్ట్రపతి…

మా అమ్మానాన్న కొట్టుకుంటుంటున్నారు .. నేను చచ్చిపోతాను – రాష్ట్రపతికి బాలుడి లేఖ ..


తరచూ గొడవపడి విడిపోయి వేర్వేరుగా జీవిస్తున్న తల్లిదండ్రులను చూసి 15 ఏళ్ల బాలుడి మనసు వికలమైంది. ఏం చేయాలో తెలియని వయసులో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు రాసిన లేఖ అందరి హృదయాలను క‌దిలించేస్తోంది.
ఇంత చిన్న వయసులోనే జీవితంపై విరక్తి పుడుతోందని, తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాసిన లేఖ చిన్నారి అంతర్మథనాన్ని కళ్లకు కడుతోంది. బీహార్‌కు చెందిన దంపతులు గొడవల కారణంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె పాట్నాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా, అతడు దేవ్‌గఢ్‌లో ఉంటున్నాడు.
వారి కుమారుడు భాగల్‌పూర్‌లో తాత వద్ద పెరిగాడు. ఇటీవల ఆయన ఉద్యోగ విరమణ చేయడంతో బాలుడు తన తండ్రి వద్దకు చేరుకుని చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోవడం ఆ బాలుడి మనసును కలిచివేసింది. ఏం చేయాలో అర్థం కాక చివరికి రాష్ట్రపతికి లేఖ రాశాడు.
తన తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయి ఎవరికి వారుగా జీవిస్తున్నారని, వారి గొడవలు తనను బాధిస్తున్నాయని, చదువుపై దృష్టి సారించ‌లేక‌పోతున్నాను…త‌న‌ తండ్రి కేన్సర్‌తో బాధపడుతున్నాడు..ఇటీవల కొందరు దుండగులు ఆయనపై దాడిచేశారని లేఖలో పేర్కొన్నాడు. ఇవన్నీ చూస్తుంటే తనకు బతకాలనిపించడం లేదని, తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని లేఖ‌లో కోరాడు.
లేఖను అందుకున్న రాష్ట్రపతి కార్యాలయం వెంటనే దానిని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. ఆ వెంటనే దంపతుల సమస్యను పరిష్కరించాల్సిందిగా పీఎంవో కార్యాలయం నుంచి భాగల్‌పూర్ కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి.
సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. బాలుడి వద్దకు చేరుకున్న జిల్లా యంత్రాంగం వివరాలు సేకరించింది. సమస్యను పరిష్కరిస్తామని ఆ చిన్నారిలో భరోసా నింపింది.

About The Author