ఏపీ మంత్రిమండలి సమావేశం లో కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులను క్యాబినెట్ ఆమోదించింది. ప్రాజెక్టుల కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను పాదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయించేలా చట్టం తీసుకురానుంది. ఈ ముసాయిదాను కూడా కేబినేట్ ఆమోదించింది. యజమాని హక్కులకు భంగం కలగకుండా 11 నెలల పాటు కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా రూపొందించిన బిల్లును ఆమోదించింది.
మద్య నిషేధం దిశగా తొలి అడుగు పడుతోంది. తొలిదశ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ జరగనుంది. ఇందుకు సంబంధించిన మసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కు కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్పర్‌కు రూ.7వేలు జీతాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. జులై నుంచీ ఈ పెంపుదల వర్తిస్తుంది.