పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం…


తిరుమల, 2019 జూలై 17: ఆణివార ఆస్థానం సందర్భంగా బుధ‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పల్లకీ ముందువైపు శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుడ‌ళ్వార్‌ న‌మ‌స్క‌రిస్తున్న సెట్టింగు, మధ్యలో ఒకవైపు చిన్ని కృష్ణులు, మరొకవైపు ద్వారక కృష్ణుడు, వెనుకవైపు యోగ‌ముద్ర‌లో శ్రీ ఆంజనేయస్వామివారి సెట్టింగులను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా రోజాలు, చామంతి, లిల్లి, మొలలు, మల్లి, కనకాంబరం, తామరపూలు, వృక్షి తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు, 5 రకాల కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు. అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్‌ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశారు.
టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 15 మంది ఉద్యానవనశాఖ సిబ్బంది వారం రోజుల నుండి పుష్పపల్లకీని రూపొందించారు. తమిళనాడులోని సెలంకు చెందిన దాత శ్రీ మణిశంకర్‌ శ్రీవారి పుష్పపల్లకీని ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, పేష్కర్‌ శ్రీ లోక‌నాథం,ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

About The Author