మోడీ పకోడీ బండార్…
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పకోడి దుకాణం ఐడియా ఆచరణలో సూపర్ హిట్ అయిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తెగ సంతోషపడుతున్నారు.
ఆగ్రా నగరంలోని నూరీ దర్వాజ ప్రాంతానికి చెందిన శ్రీ గోపాల్ అగర్వాల్, రాజ్‌కుమార్ గార్గ్, అశోక్ కుమార్ లు ఉద్యోగాల్లేక రోజువారీ కూలీలుగా పనిచేసే వారు. ‘‘నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా, పకోడీ బండ్లు పెట్టుకోని ఆదాయం సంపాదించుకోవాలి’’… అని కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు.
అప్పట్లో ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. కాని మోదీ పకోడీల ఐడియాతో ఆగ్రాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు ఉపాధి లభించింది. తాము నివాసముంటున్న నూరి దర్వాజ ప్రాంతంలో శ్రీ గోపాల్ అగర్వాల్, రాజ్‌కుమార్ గార్గ్, అశోక్ కుమార్ లు కలిసి ‘‘మోదీ పకోడా భండార్’’ పేరిట పకోడీల దుకాణం ప్రారంభించారు.
మొదట ఐదువేల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన పకోడీల దుకాణంతో తమకు ఉపాధి లభిస్తుందని వారు చెప్పారు. మిర్చి పకోడాతోపాటు పాలక్, ఆలూ, పెసర, కోఫ్తా పకోడాలు చేస్తూ రోజుకు ముగ్గురు కలిసి తలో ఆరువందల రూపాయలు సంపాదిస్తున్నారు. మోదీ ఇచ్చిన ఐడియా తమకు ఉపాధి కల్పించిందని ముగ్గురూ ముక్తకంఠంతో చెప్పారు.