తిరుమల భక్తులకు శుభవార్త…


శ్రీవారి దర్శనార్థం కొన్ని గంటల ముందుగా నిర్ణీతకాల టోకెన్లు (స్లాటెడ్‌) పొంది కొండపైకి చేరుకునే భక్తులకు సౌకర్యవంతమైన నిరీక్షణ సముదాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి, కిలోమీటర్ల పొడవునా విస్తరించిన క్యూలైన్లలో తోపులాటలకు గురయ్యే కష్టాలు తొలగిపోనున్నాయి. దివ్య, సర్వదర్శన స్లాటెడ్‌ టోకెన్ల భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి ఉద్యానవనంలో రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సమయానికి వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగం కృషి చేస్తోంది.

స్లాటెడ్‌ టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన స్లాట్‌తో నిమిత్తం లేకుండా కాస్త ముందుగా శ్రీవారి దర్శనం ముగించుకోవాలనే ఆలోచనతో నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ముందుగా గుమికూడుతున్నారు. ఇలాంటి వారిని క్యూలైన్‌ ప్రవేశం వద్ద సిబ్బంది అడ్డుకుని టోకెన్‌పై ఉన్న సమయానికి గంట ముందుగా రావాలని తిప్పి పంపాల్సి వస్తోంది. అయినా భక్తులు తిరిగివెళ్లక గంటలకొద్ది రోడ్లపై, చెట్లకింద గడుపుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో రోజు ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.అప్పుడప్పుడూ అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ధర్నాకు దిగడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్‌కు అనుబంధంగా పది అధునాతన వెయిటింగ్‌ హాళ్ల నిర్మాణం చేపట్టారు.

పది భారీ షెడ్ల నిర్మాణం
రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ఎదురుగా నారాయణగిరి ఉద్యావనంలో వలయాకారంలో అన్ని మౌలిక సదుపాయాలతో పది కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. వీటికి అనుబంధంగా క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కాంప్లెక్స్‌లో దాదాపు 2వేల మంది వేచివుండవచ్చు. వేసవిలోనూ ఇబ్బందిలేకుండా వీటి పై కప్పుకు గాల్వనైజ్డ్‌ షీట్స్‌ వాడుతున్నారు. దర్శన వేళల వివరాలు ఎప్పటికప్పుడు తెలిపేలా ప్రతి కాంప్లెక్స్‌ బయట డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. దీనిని అనుసరించి భక్తులు తమ టోకెన్లపై ఉన్న టైంస్లాట్‌ ప్రకారం ఆయా కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి వుంటుంది. కరెక్టు సమయానికి వచ్చే భక్తులు నేరుగా క్యూలైన్‌లోకి వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు.

అన్ని సౌకర్యాలతో…
ఈ పది నిరీక్షణ సముదాయాల్లోనే లగేజీ, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కేంద్రాలు ఉంటాయి. అన్నపానీయాల వితరణ, కేంద్రాలు, తాగునీటి కొళాయిలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు అన్నీ ఉంటాయి. నిరీక్షణ సమయంలో యాత్రికుల కాలక్షేపం కోసం భక్తిచిత్రాల ప్రదర్శనకు భారీ స్ర్కీన్లు కూడా అమరుస్తున్నారు.

About The Author