90 వేలకే మినీ ట్రాక్టర్‌…

మెట్ట పంటలకు వరం … 80 శాతం సాగు పనులకు ఉపయోగం వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెద్ద కమతాలకే పరిమితం అవుతోంది. చిన్న కమతాలకు అనుగుణమైన యంత్రపరికరాలు లభ్యం కాకపోవడంతో 80 శాతానికి పైగా రైతులు కూలీల మీదే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో తోడ్పడే యంత్రాలను రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త సైదాచారి.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కందగట్ల గ్రామానికి చెందిన జిల్లోజు సైదాచారి పాఠశాల విద్యతో చదువుకు స్వస్తి చెప్పారు. ఆయన తండ్రి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మతులు చేసేవారు. చిన్నతనం నుంచి రైతుల సమస్యలను దగ్గర నుంచి గమనించి ఆయన సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నారు. రైతులకు అన్ని పనుల్లో తోడ్పడే ట్రాక్టర్‌ను తయారు చేస్తే ఎలా వుంటుందని ఆలోచించారు. మూడేళ్ల పాటు అహర్నిశలు శ్రమించి 80 శాతం వ్యవసాయ పనులకు ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. మినీ ట్రాక్టర్‌ రూపొందించే క్రమంలో కొంతకాలం క్రితం ట్రిల్లర్‌ను రూపొందించారు. అయితే రైతులు స్వయంగా దాన్ని నెట్టుకోవాల్సి రావడంతో శ్రమ లేకుండా నడిచే మినీ ట్రాక్టర్‌ జీవం పోసుకుంది.

విత్తనం నాటడం మొదలుకుని కలుపుతీయడం, బోదెలు పోయడం, మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులన్నీ ఈ మినీ ట్రాక్టర్‌తో చేయవచ్చు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటలు, మెట్ట, ఆరుతడి పంటలు పండ్ల తోటలన్నింటిలోనూ సేద్యపు పనులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఆరు క్వింటాళ్ల వరకు సరుకు రవాణాకు కూడా ఇది ఉపయోగంగా ఉంటుంది. 200 కిలోల బరువు వున్న ఈ మినీ ట్రాక్టర్‌కు ముందుకు వెనక్కు వెళ్లేందుకు గేర్లు కూడా అమర్చడం విశేషం. గతంలో ఇనుప ఎడ్ల బండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటోవేటర్‌ను తయారుచేసి ఎందరో రైతుల అభిమానాన్ని చూరగొన్నారు ఈ గ్రామీణ ఆవిష్కర్త.

5 హెచ్‌పీ సామర్థ్యం గల చైనా ఇంజన్‌ రెండు ట్రిల్లర్‌ టైర్లు, మరో రెండు ఆటో టైర్లు, సామిల్లులో వాడే బేరింగులను మినీ ట్రాక్టర్‌ తయారికి ఉపయోగించారు. బెల్టుల సాయంతో చక్రాలు తిరిగేలా రూపకల్పన చేసి ఇనుప హబ్బులు, డిస్కులను తన వెల్డింగ్‌ చాకచక్యంతో సొంతంగా తీర్చిదిద్దారు. ఒక మనిషి సహాయంతో రూ. 70 వేల ఖర్చు చేసి 15 రోజులకు ఒక ట్రాక్టర్‌ను శ్రద్ధగా తయారుచేస్తున్నారు. నామమాత్రంగా లాభం వేసుకుని ఈ ట్రాక్టర్‌ను 90 వేలకే విక్రయిస్తున్నారు. సైదాచారి ఇప్పటివరకు 8 ట్రాక్టర్లు తయారుచేసి విక్రయించాడు. సూర్యాపేట జిల్లాలోనే కాకుండా గుంటూరు, ప్రకాశం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ట్రాక్టర్లను విక్రయించడం విశేషం. చిన్న రైతుల నుంచి 10 ఎకరాలు సాగు చేసే రైతుల వరకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లీటర్‌ డీజిల్‌తో దీంతో ఎకరం భూమి దున్నవచ్చు. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు మందు పిచికారీ చేసేందుకు, ఎరువులు వేసేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఆవిష్కరణలను పల్లె సృజన, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తామని ఇటీవల కందగంట్ల సందర్శించిన పల్లె సృజన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, విశ్రాంత బ్రిగేడియర్‌ పోగుల గణేషం చెప్పారు.

• సన్న, చిన్నకారు రైతుల కోసం…!

సన్న, చిన్నకారు రైతులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో మూడేళ్ల శ్రమించి మినీ ట్రాక్టర్‌ రూపొందించాను. దీంతో పాటు పలు వ్యవసాయ యంత్ర పరికరాలను రూపొందించిన రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాను. మినీ ట్రాక్టర్‌ ఆవిష్కరణ లో నా భార్య జ్యోతి సహకారం మరువలేనిది. ప్రభుత్వం ఆర్థికంగా సహాకారం అందిస్తే మరిన్ని అవిష్కరణలు చేసి చిన్న రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యం.
– సైదాచారి, ఫోన్‌ నెం. 99512 52280

About The Author