శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య రుత్విక్ వరణం…
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని
శ్రీ కోదండరామాలయంలో శనివారం అంకురార్పణం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. సాయంత్రం 7 నుండి 8.30 గంటల వరకు మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగనున్నాయి.
టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్యులకు, ఋత్వికులకు, అర్చకులకు చందనతాంబూలం, వస్త్రాలు సమర్పించి పవిత్రోత్సవాలు నిర్వహించాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. జూలై 28న పవిత్రప్రతిష్ట, జూలై 29న పవిత్ర సమర్పణ, జూలై 30న పూర్ణాహుతి జరుగనున్నాయని వివరించారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, భజనలు, కోలాటాలు, ఇతర సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. పవిత్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కోదండరామాలయ ప్రధానార్చకులు శ్రీ ఆనందకుమార్ ఆచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి, ఏఈవో శ్రీ ఎస్.తిరుమలయ్య, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.