అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు…
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జైపాల్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న కేసీఆర్ జూబ్లీహిల్స్‌లోని జైపాల్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తెరాస నేతలు కె.కేశవరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు.
సోమవారం నెక్లెస్ రోడ్ లో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరుపనున్నట్లు సీఎం తెలిపారు. నెక్లస్ రోడ్ లో పివి ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ప్రభుత్వం తూర్పు సైడ్ స్థలం కేటాయించింది.
పార్టీ కార్యకర్తలు, అభిమానులు చూసేందుకు జైపాల్ రెడ్డి మృతదేహాన్ని 10.30 నుంచి 12.00 గంటల వరకు గాంధీ భవన్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పీవీ ఘాట్ దగ్గర దహన సంస్కారాలు జరుగుతాయని, ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని మాజీ ఎంపీ,రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.