కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మోదీ ప్రభుత్వంలో పెరుగుతున్న ప్రాధాన్యత…


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మోదీ ప్రభుత్వంలో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తూ ఆమెకు లోక్‌సభలోని ముందువరుసలో సీటు కేటాయించారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. మోదీ తొలి ఇదేళ్ల ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆమె పనిచేశారు.
కొత్త లోక్‌సభలో ఎవరెవరు ఏయే స్థానాల్లో కూర్చోవాలనే సీటింగ్ ఎరేంజ్‌మెంట్లకు స్పీకర్ ఓం బిర్లా సమ్మతి తెలిపారు. ఆ ప్రకారం, మొదటి వరుసలో ప్రధాని మోదీతో పాటు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హెచ్‌డీ సదానంద గౌడకు సీట్లు కేటాయించారు. వీరితో పాటు స్మృతి ఇరానీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ యాదవ్‌కు కూడా తొలి వరుసలో సీట్లు కేటాయించారు.
స్పీకర్ సీటుకు దగ్గరుండే తొలివరుసలో ఎన్డీయే షేర్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ 51 సీట్లకే పరిమితం కావడంతో తొలివరుసలో కాంగ్రెస్ కోటా 2 వద్దే నిలిచింది. సహజంగా మొదటి వరుసలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ సభానాయకుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ దిగ్గజాలు ఎల్.కె.అద్వానీ, మనోహర్ జోషి వంటి వారు కనిపించేవారు. ఈసారి, వీరిలో చాలామంది రిటైర్ కాగా, దేవెగౌడ ఎన్నికల్లో ఓడిపోయారు.

About The Author