అత్తి వరదరాజ స్వామి చరిత్ర…

40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా ప్రసిద్ధి పొందింది.సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచి లో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది). ఈ ఆలయ౦లోని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.

స్వామి చరిత్ర లోకి వస్తే రెండు కధలు వినిపిస్తుంటాయి.

చతుర్ముఖ బ్రహ్మ గారు సృష్టి మొదలుపెట్టడానికి ముందు విష్ణు మూర్తిని గురించి ఒక యజ్ఞము చేసారట. అయితే ఆ యజ్ఞానికి సరస్వతి దేవిని ఆహ్వానించ పోవడం వలన సరస్కవతి దేవి అలిగి యజ్ఞానికి రాలేదు. సరస్వతీ దేవి అలకను గురించి విన్న బ్రహ్మ దేవుడు , ఆవిడ లేకుండా సావిత్రీ దేవి , సంధ్యా దేవి సమేతంగా యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞము లోక కళ్యాణార్ధమై తలపేట్టినది. సరస్వతీ దేవి యజ్ఞాన్ని ఆటంక పరచేందుకు నదీ రూపంలో సమీపించగా,విష్ణు మూర్తి జరుగనున్న విపత్తును గమనించి తన వరద హస్తముతో అడ్డుపెట్టాడు.అంతటితో సరస్వతి నదీ ప్రక్కకు వెళ్ళిపోయింది. యజ్ఞం పూర్తి కావస్తుండగా విష్ణు మూర్తి యజ్ఞ కుండం నుండి అత్తి చెట్టు రూపంలో ప్రత్యక్షమయినాడు. బ్రహ్మను అనుగ్రహించడానికి అత్తి చెట్టులో దర్శనం ఇచ్చిన విష్ణు మూర్తిని , అలానే అత్తి చెట్టులో ఉంటూ అందరినీ అనుగ్రహించమని బ్రహ్మ దేవుడు కోరగా , విష్ణు మూర్తి అలానే అని వరమిచ్చి వరదరాజ స్వామిగా నిలిచిపోయాడు. అయితే సరస్వతీ దేవి కూడా వరదరాజ స్వామిని ప్రార్ధించగా ఆవిడ అలక తీర్చి , ఆనందాన్ని చేకూర్చుట కొరకు ఒక లీలను ప్రదర్శించారు.

సరస్వతి దేవిని నదీ రూపంలో ” అమృత కుండం ” పేరుతో ఒక నీటి కొలనులా ఆవిర్భవించమని కోరాడు. యజ్ఞం సమాప్తి అవుతుండగా యజ్ఞ కుండం నుండి వస్తున్న మంటలు స్వామి వారి అత్తి విగ్రహాన్ని దహిస్తున్నాయి. అది గమనించిన బ్రహ్మ దేవుడు నివ్వెరపోయి స్వామి వారిని క్షమాపణ కోరుతూ పరిహారం తెలియజేయమని వేడగా , స్వామి వారు తన అత్తి విగ్రహాన్ని అమృత కుండంలో నిక్షిప్తం చేసి సేదతీర్చమని చెప్పారు. అలా విష్ణు మూర్తి అత్తి వరదరాజ స్వామిగా అవతరించి ఏకకాలంలో బ్రహ్మ దేవుడిని , సరస్వతీ దేవిని అనుగ్రహించారు. విష్ణు మూర్తి ఇంకా ఇలా చెప్పారు, అత్తి వరదరాజ విగ్రహాన్ని అమృత కుండంలో 40 సంవత్సరాలు ఉంచిన తరువాత బయటకు తీసి షోడశోపచారాలు చేసి మరల అమృత కుండంలో ఉంచాలి. అక్కడే ఆదిశేషుని పై నేను పవళిస్తూ ఉంటాను అని. అమృత కుండంలో స్వామి వారిని బధ్రపరచే చోట ఆదిశేషుని విగ్రహం కూడా ఉన్నది , చిత్గరాలలో గమనించగలరు. అందుకే ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నారని ఒక కధనం.

ఇది ఒక కధనం కాగా మరొకటి కూడా ప్రాచుర్యంలో ఉన్నది.

పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ గారు దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీవరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తి కి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమం లో తురుష్కులు కంచి పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తి కి హాని కలుగకుండా వుండేందుకై ఆలయం లో ని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట.లోపలికి నీళ్లు చేరని విధం గా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట.

తదనంతర కాలం లో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు.

ఇవి రెండు ప్రధానంగా వినిపిస్తున్న కధలు. నిజానిజాలు వరదరాజ పెరుమాళ్ కే ఎరుక

అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు.

మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమ లో ను దర్శనం ఇస్తారు.
ఉచిత దర్శనం ఉదయం 5 గ0 నుండి సాయంత్రం 6 గం వరకు …
తమిళనాడు లో ని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాలనుండి తిరుపతి,చెన్నై లనుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి …

నేటి నుండి నిలబడి దర్శనం ఇవ్వనున్న శ్రీ అత్తి వరదరాజ స్వామి వారు , ఇప్పటివరకూ పవళిస్తూ దర్శనమిచ్చిన అత్తి వరదరాజ స్వామి వారు నేటి నుండి నిలచున్న దర్శనం అనుగ్రహిస్తున్నారు

అందరూ దర్శించుకునేందుకు దయచేసి షేర్ చేయండి

ఓం నమో భగవతే వాసుదేవాయ

About The Author