జియో ఫైబర్ వచ్చేస్తుంది..
టెలికం రంగంలో అడుగుపెట్టి ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో ఈ నెల 12న మరో సంచలనాన్ని ప్రకటించబోతోందని సమాచారం.. జియో గిగాఫైబర్ పేరుతో ఒకేసారి ఒకే కనెక్షన్‌పై మూడు సేవలు అందించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తుంది.. ఇప్పటికే ఈ సేవలను దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరీక్షలు తుది దశలో ఉన్నాయి. ఈ నెల 12న జరగనున్న జియో వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో గిగాఫైబర్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్లాన్లు, ధరల వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ ఇలా ఉండే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
జియో గిగాఫైబర్ ప్లాన్లు, ధరలు: జియో గిగాఫైబర్‌లో ఖాతాదారులకు 28 రోజుల కాలపరిమితితో మూడు సేవలు లభించనున్నాయి. అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్, జియో హోం టీవీ సర్వీసులు, కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
కాంబోప్లాన్లో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ సేవలను ఒకే ఒక్క కనెక్షన్‌తో పొందవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.600గా ఉండే అవకాశం ఉంది. వెయ్యి రూపాయల ప్లాన్‌లో ఇంట్లోని 40 డివైజ్‌లకు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మూడు వేర్వేరు ప్లాన్లను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్, టీవీ, ఐఓటీ సేవల్లో ఏదో ఒకదానిని కూడా ఎంచుకునే వెసులుబాటు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కనెక్షన్ తీసుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2500 కానీ, రూ.4500 కానీ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సేవలు వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు వెనక్కి ఇచ్చేస్తారు