జె.జె.యాక్టు 2015ను ఖచ్చితంగా అమలుచేయాలి…
శ్రీకాకుళం: జె.జె.యాక్టు 2015ను ఖచ్చితంగా అమలుచేయాలని బాలల సంక్షేమ సమితి చైర్మన్ గురుగుబెల్లి నరసింహమూర్తి తెలిపారు. స్ధానిక శాంతినగర్ కాలనీలో వున్న బాలల సంక్షేమ సమితి కార్యాలయంలో సి.డబ్ల్యు.సి.చైర్మన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 జూలై 3న తాము బాధ్యతలను చేపట్టామని తెలిపారు. దీనికి మెట్రోపోలిటిన్ మెజిస్ట్రేట్ లేదా ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అధికారాలు ఉన్టాయన్నారు. నిరాదరణకు గురికాబడిన, హింసకు గురికాబడిన బాలలు, అప్పగించ బడిన బాలలు, విడవబడిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహాల నేపధ్యంలో రక్షణ కల్పించవలసిన బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు జె.జె.యాక్టును అమలు చేయాలని తెలిపారు. అనాధ పిల్లలు, రక్షణ అవసరమైన పిల్లల కోసం చైల్డ్ కేర్ ఇన్టిట్యూట్లు(సిసిఐ) జిల్లాలో 32 పని చేస్తున్నాయని చెప్పారు. నెలలో 2 సార్లు చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్టిట్యూట్ లను బాలల సంక్షేమ సమితి విజిట్ చేయాల్సి వుంటుందని తెలిపారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్టిట్యూట్ లో జెజె యాక్టును సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించడం, రూల్స్ అనుసరించి నడుపబడుతున్నదీ లేనిదీ పరిశీలన చేయవలసి వుంటుందని తెలిపారు. చైల్డ్ లైన్, ఐసిడిఎస్ లేదా బాధ్యత గల పౌరుల ఫిర్యాదుల మేరకు సదరు అంశాన్ని పరిశీలన చేసి, విచారణ చేపట్టి నిర్ణయం తీసుకునే అధికారం బాలల సంక్షేమ సమితికి వుంటుందని తెలిపారు. ఈ క్రమంలో బాలల సంక్షేమ సమితి బాలల హక్కుల కోసం జిల్లాలోని సిసిఐలను పరిశీలన చేయడం జరిగిందని, నిర్వహణ లోపాలు, మెరుగైన సదుపాయాలపై వారికి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారిని ఆదేశించినట్లు ఆయన తెలిపారు