జీవితాన్ని మార్చేసిన కరివేపాకు…


కరివేపాకు సాగులో చరిత్ర సృష్టిస్తున్న తట్రకల్లు రైతులు

నీటిని పొదుపుగా వాడుతూ పంటల సాగు

ఏటా తిరుగులేని ఆదాయం

తట్రకల్లు టూ ముంబై

అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గంలోనే. చుట్టూ ఎటు చూసినా నల్లరేగడి భూములు. వేల అడుగుల లోతున బోరుబావులు తవ్వించినా.. నీటి చెమ్మ తగలని భూములు. వర్షాధారంపైనే పంటల సాగు. సాగునీటి వనరులంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో ఇటుగా వచ్చిన హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కనబరిచింది.

ఫలితంగా దారుణమైన పరిస్థితులను ఈ ప్రాంత రైతులు చవిచూస్తూ వచ్చారు. పంటల సాగు భారమైన ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలోని తట్రకల్లు గ్రామ రైతులు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. కరివేపాకు సాగుతో ఏటా తిరుగులేని ఆదాయం గడిస్తున్నారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ జనాభా 1,800. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయామే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాలు సాగులో ఉండగా.. మొత్తం కరివేపాకు సాగు చేపట్టడం గమనార్హం. ఇక్కడ సాగు చేస్తున్న కరివేపాకును రైతులు ముంబయికి ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

About The Author