లడఖ్ ఎంపీ ప్రసంగానికి ఫిదా…
జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పించిన అధికరణ 370 రద్దుకు మద్దతుగా లోక్‌సభలో మాట్లాడిన లడఖ్ ఎంపీ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్ యావత్తు దేశాన్ని ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అధికార పక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఆయనను ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్లు చేశారు. ఆయనతో కలిసి స్మృతి ఇరానీ ఫొటో దిగి, ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
లడఖ్‌ను గతంలో పెంపుడు బిడ్డలా చూశారని ఆరోపిస్తూ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్ చేసిన ప్రసంగానికి చప్పట్లతో లోక్‌సభ మారుమోగింది. జమ్యంగ్ మాట్లాడుతూ లడఖ్ 71 సంవత్సరాల నుంచి కేంద్ర పాలిత ప్రాంతం హోదా కోసం పోరాడుతోందన్నారు. లడఖ్‌కు చాలా ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని, కశ్మీరీల ఆధిపత్యంగల ప్రభుత్వం తమ డిమాండ్లను ఎన్నడూ పట్టించుకోలేదని చెప్పారు.
లడఖ్ గురించి మాట్లాడుతున్నవారికి దాని గురించి తెలిసింది ఏమిటని ప్రశ్నించారు. 71 సంవత్సరాల నుంచి కేంద్ర పాలిత ప్రాంతం హోదా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరుతో కలిసి ఉండాలని లడఖ్ ఎన్నడూ కోరుకోలేదన్నారు. అధికరణ 370 వల్ల కేవలం రెండు కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయన్నారు. కార్గిల్ గురించి వారికి తెలిసిందేమిటని ప్రశ్నించారు. లడఖ్‌కు చెందిన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల జిల్లా అధ్యక్షులు లడఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా కావాలని డిమాండ్ చేస్తే, వారిని ఆ పదవుల నుంచి ఆ పార్టీలు తొలగించాయన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే లడఖ్‌కు సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కశ్మీరీలను, డోగ్రాలను గుర్తించారు కానీ లడఖ్ ప్రజలను గుర్తించలేదన్నారు. అధికరణ 370ని దుర్వినియోగపరిచారన్నారు. జమ్మూ-కశ్మీరులో బౌద్ధులను అంతం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
మోదీ ప్రశంసలు :
లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్ ప్రసంగించిన తీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విశేషంగా ఆకట్టుకుంది. జమ్యంగ్ ప్రసంగాన్ని విని తీరాలంటూ మోదీ ఓ ట్వీట్ చేశారు.
‘‘నా యువ మిత్రుడు, లడఖ్ ఎంపీ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్ జమ్మూ-కశ్మీరు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా లోక్‌సభలో అద్భుతంగా ప్రసంగించారు. సందర్భశుద్ధితో, సమగ్రంగా మన లడఖ్ సోదర, సోదరీమణుల ఆకాంక్షలను తెలిపారు.
దీనిని తప్పనిసరిగా వినాలి!’’ అని మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా జమ్యంగ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంటులో ఆయనతో కలిసి పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. నేటి పార్లమెంటరీ హీరో ఆయనేనని ప్రశంసించారు. భారతీయులంతా ఆయన ప్రసంగాన్ని విని తీరాలన్నారు.