జమ్యాంగ్ సేరింగ్ నంగ్యాల్… లడక్ ఎంపీ… ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు…


ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకాశ్మీర్ విభజన అంశంపై లోకసభలో మాట్లాడిందే పది నిమిషాలు… ఆ కాసేపట్లో అదరగొట్టేశాడు…

లోకానికి తెలియని చాలా అంశాలు వినిపించాడు… కాదు, లడఖ్ గుండె చప్పుడును వినిపించాడు… తను మాట్లాడుతున్నంతసేపూ అధికార పార్టీ సభ్యుల నుంచి హర్షధ్వానాలు, చప్పట్లు…

సీరియస్‌గా కనిపించే అమిత్ షా కూడా పలుసార్లు బల్ల చరుస్తూ, నవ్వుతూ ఆనందపడిపోయాడు… విపక్షం నుంచి సైలెన్స్… కాంగ్రెస్‌నే కాదు, పీడీపీ, ఎన్సీ పార్టీలనూ ఏకిపారేశాడు తను…

తను బీజేపీ ఎంపీ… ఎవరబ్బా ఇతను అని తరచి చూస్తే…

తను లేహ్ ప్రాంతంలో పుట్టాడు… అక్కడే స్కూలింగు అయ్యాక, జమ్ము యూనివర్శిటీలో డిగ్రీ చేశాడు…

ఆల్ లడఖ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పనిచేస్తూ, రాజకీయాల్లోకి చేరాడు… లడఖ్ ఎంపీ దగ్గర ప్రైవేటు సెక్రెటరీగా చేరాడు…

తరువాత Ladakh Autonomous Hill Development Council, leh కి ఎన్నికయ్యాడు… దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌గా ఉన్నాడు కొద్దికాలం… మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టికెట్టుపై నిలబడి గెలిచాడు… తను రచయిత…

తను లోకసభలో మాట్లాడుతూ… ‘‘మా కాశ్మీర్ పతాకం, మా ఆత్మాభిమానం, మా ప్రత్యేకత, మా రాజ్యాంగం అని కాశ్మీరీ నేతలు పదే పదే చెబుతున్నారు గానీ మేం 2011లోనే మా కౌన్సిల్‌‌లో ఆ కాశ్మీరీ పతాకాన్ని తీసేసి, కేవలం భారతీయ పతాకాన్నే పెట్టుకున్నాం…

ఎందుకంటే… మమ్మల్ని ఈ కాశ్మీరీ పార్టీలు, నేతలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారు… మా ప్రాంతం 70 ఏళ్లుగా తమను కాశ్మీరీల నుంచి దూరంగా ఉంచాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలని కోరుతున్నది…

ఇప్పుడు ఆ కల నెరవేరింది… మా భాషకు గుర్తింపు ఉండదు, మా యువతకు ఉద్యోగాలూ ఉండవు, మాకు రావల్సిన డబ్బునూ వాళ్లే తినేస్తారు, అసలు మమ్మల్ని ఎన్నడూ పట్టించుకోలేదు…

నిజానికి లడఖ్ అభిప్రాయం తీసుకోకుండా ఈ విభజన జరుగుతున్నదని ఆరోపించేవాళ్లను చూస్తే జాలేస్తున్నది… రాజనాథ్‌సింగ్ స్వయంగా లడఖ్ వచ్చి అన్ని పార్టీలు, అన్ని మతసంఘాలతో మీటింగు పెట్టాడు…

మాకు కేంద్రపాలిత ప్రాంతం కావాలంటూ ఆ మీటింగు ఏకగ్రీవంగా చెప్పింది ఆరోజు… ఇంకేమైనా కావాలా అని తను అడిగితే, అది ఇస్తే చాలు, అన్నీ వస్తాయి మాకు అని చెప్పాం… అంతేకాదు, మా మేనిఫెస్టోలో పెట్టి, ఇల్లిల్లూ తిరిగి కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని చెప్పాం…

వాళ్లు వోట్లేసి గెలిపించారు… వాళ్ల కోరిక ఇప్పుడు నెరవేరింది… ఇదే పీడీపీ, ఇదే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల లడఖ్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేంద్ర పాలిత ప్రాంతం కావాలని సంతకాలు చేస్తే, ఈ పార్టీలు వెంటనే వాళ్లను తొలగించాయి…

మీ కాశ్మీరీల అభిప్రాయాల్ని మా లడఖ్‌పై ఎందుకు రుద్దుతున్నారు…? ఇకనైనా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి… ఇన్నాళ్లూ కశ్మీర్ సమస్య అంటూ ఇన్నేళ్లూ చెబుతున్నవాళ్లే నిజానికి ఓ సమస్య… సమస్యలో ఓ భాగం…’’

ఇలా సాగిపోయింది తన ప్రసంగం…

About The Author