ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ…


న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రధాన అజెండాగా సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటన చేపట్టారు.

అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు వివాదాస్పదమైన పోలవరం కాంట్రాక్టుల రీటెండరింగ్ అంశం, పీపీఏల రద్దు వంటి అంశాలపై మోదీకి సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్థిక సహకారం, విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనూ మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ లు సైతం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఇకపోతే అంతకు ముందుపీఎంవో కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శులతో జగన్ భేటీ అయ్యారు. పీఎంవో కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, అదనపు కార్యదర్శి పీకే శర్మలతో సుమారు 40నిమిషాలపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ లోక్ సభకు వెళ్లనున్నారు. లోక్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.తొలుత మంగళవారం మధ్యాహ్నాం 2.30గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. అయితే లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుపై వాడీవేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కలిసేందుకు సమయం కుదరలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం అమిత్ షాతో భేటీ కానున్నారు.

About The Author