శుక్రవారం రాత్రికి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది…
కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద ఉన్న ఉజ్జని జలాశయానికి వరద పోటెత్తడంతో క్రెస్ట్ గేట్లన్నీఎత్తారు. అక్కడి నుంచి మంగళవారం రాత్రి రెండు లక్షల క్యూసెక్కులు దిగువన ఉన్న జూరాల డ్యాం వైపు పరుగులు పెడుతున్నాయి. భీమా నది జూరాల ఎగువన రాయిచూర్ వద్ద కృష్ణలో కలుస్తుంది.
బుధవారానికి ఉజ్జని ఇన్ ఫ్లో 2 లక్షల 20 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. ఉజ్జని నుంచి కృష్ణాలో సంగమించేందుకు భీమా 275 కి.మీ ప్రయాణిస్తుంది.
ఆల్మట్టి నుంచి వస్తున్న3.3 లక్షల క్యూసెక్కులు, భీమా వరదతో కలిపి కృష్ణాలో 5 లక్షల ప్రవాహం శ్రీశైలానికి చేరనుంది.
ఆల్మట్టి, భీమా వరదలు మరో నాలుగు రోజులు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఆతర్వాత కూడా లక్షన్నర నుంచి రెండు లక్షల క్యూసెక్కుల స్థాయిలో నెలాఖరు వరకు వరద ఉంటుంది. ఆగస్టు చివరి నాటికి నాగార్జున సాగర్లో 150 టిఎంసీల దాకా కొత్త నీరు చేరే అవకాశం ఉంది. ఈ సారి సాగర్ నిండుతుంది.
మహారాష్ట్రలోని జైక్వాడ్ డ్యాం కూడా వేగంగా నిండుతోంది. రోజుకు 10 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది.102 టిఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న జైక్వాడ్ నిండి వచ్చే వరదంతా శ్రీరాంసాగర్ కు చేరుతుంది.
జల ప్రవాహాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు. cubit feet per second ను క్లుప్తంగా cusec అని పిలుస్తారు. సెకనుకు11,540 క్యూబిక్ ఫీట్ల(ఘనపుటడుగుల) ప్రవాహం 24 గంటల పాటు ఒక జలాశయంలోకి ప్రవహిస్తే ఒక టిఎంసీ నీరు చేరుతుంది. ఒక క్యూబిక్ ఫుట్ ప్రవాహం 28 లీటర్ల నీటితో సమానం.( ఫోటో: ఉజ్జని డ్యాం)