నగర సిగలో లక్డీకాపూల్..
అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసేందుకేకాక పర్యాటకులను ఆకర్శించేందుకు మహా నగర పాలక సంస్థ ఆయా ప్రాంతాలలో కొన్ని కట్టడాలు చేపడుతూ గత స్మృతులను పదిలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా నగర నడిబొడ్డున ఉన్న లక్డీకాపూల్‌లో కర్రతో చేసిన బ్రిడ్జ్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. అలనాడు కర్రతో చేసిన బ్రిడ్జ్ ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతానికి లక్డీ కా పుల్ గా పేరు స్థిరపడిపోయింది. నిజాం కాలంలో రవాణా వ్యవస్థకు ప్రధాన కూడ లిగా ఉన్న ఈ ప్రాంతంలో రైల్వే లైన్‌పై చెక్కతో చేసిన బ్రిడ్జ్ ఉండేది. ఈ బ్రిడ్జ్ నగరంలోని నాటి పాలకులకు, పాత బస్తీ ప్రజలకు శతాబ్దాల కాలంగా వారిధి గా ఉండేది. కాలక్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో ప్లై ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టడంతో శతాబ్దాల కాలంనాటి ఇక్కడి చెక్క బ్రిడ్జ్ కను మరుగైంది. నాటి నుంచి నేటి వరకు పర్యాటకులకు , రవాణా వ్యవస్థకు ప్రధాన కూడలిగా చెలామణి అవుతున్న లక్డీ కాపూల్‌లో నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడ రూ.25 లక్షలతో కర్రతో చేసిన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆధ్వర్యంలో ఒక నెలలో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. బుధవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు మంత్రులు సందర్శకుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్‌ను ప్రాంరంభించనున్నారు.