తిరుమలలో శ్రీకృష్ణజన్మాష్టమికి ఏర్పాట్లు పూర్తి…


తిరుమలలో ఆగ‌స్టు 23న శుక్ర‌వారం శ్రీకృష్ణజన్మాష్టమి, ఆగ‌స్టు 24న శ‌నివారం ఉట్లోత్సవం నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

శ్రీ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆగ‌స్టు 23వ తేదీన‌ రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రభంద శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేప‌డ‌తారు.

కాగా, ఆగ‌స్టు 24న సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య తిరుమలలో ఉట్లోత్సవాన్నివైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగ‌స్టు 24వ తేదిన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ వేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

* గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద …

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లోని గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద ఆగ‌స్టు 23న గోకులాష్ట‌మి వేడుక‌లు నిర్వ‌హిస్తారు. ఇక్క‌డి ఉద్యాన‌వ‌నంలో వెల‌సిన కాళీయ‌మ‌ర్ధ‌నుడైన శ్రీ‌కృష్ణునికి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి 1 గంట మ‌ధ్య అభిషేకం, నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా అన్న‌దానం, ఉట్లోత్స‌వం నిర్వ‌హిస్తారు

About The Author