చిదంబరంకు షాక్: 5రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పచెబుతూ కోర్టు ఆదేశం…


ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. చిదంబరం నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందంటూ ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనకు ఒప్పుకున్న న్యాయస్థానం … ముందుకెళ్లాల్సిందిగా సీబీఐకి సూచించింది. అంతేకాదు ప్రతి రోజు కుటుంబ సభ్యులు చిదంబరంను అరగంటసేపు కలిసే అవకాశం ఇచ్చింది న్యాయస్థానం.

హై కోర్టులో కార్తీ చిదంబరంకు చుక్కెదురు, స్టే ఇవ్వలేం, సీబీఐలో తండ్రి చిదంబరం కేసు !

అంతకుముందు చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది.
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 24 గంటల తర్వాత అజ్ఞాతం వీడిన చిదంబరంను ఆయన నివాసం నుంచి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ఈడీ, సీబీఐ అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశాయి.

*సీబీఐ కోర్టుకు చిదంబరం*

బుధవారం రాత్రి సీబీఐ చిదంబరంను అరెస్టు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తిని ఇలా సీబీఐ అరెస్టు చేయడం చరిత్రలో తొలిసారి కావడం విశేషం. రాత్రంతా సీబీఐ అదుపులో ఉన్న చిదంబరంను అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే చిదంబరం సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక సీబీఐ తరపున సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా… చిదంబరం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు వాదించారు. విచారణ సందర్భంగా చిదంబరం బోనులో నిల్చున్నారు. అయితే కూర్చొనేందుకు ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది.

*చిదంబరంను ఐదురోజుల పాటు కస్టడీకి అప్పగించండి: సీబీఐ*

ఇదిలా ఉంటే మనీలాండరింగ్‌లోనే ఇది ఒక అరుదైన కేసుగా అభివర్ణించారు సీబీఐ తరపున లాయర్ తుషార్ మెహతా. చార్జ్‌షీటు దాఖలు చేయాల్సిన సమయంలో చిదంబరం విచారణకు సహకరించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు తుషార్ మెహతా. మౌనంగా ఉండాలనుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అయితే కేసుకు సంబంధించి నోరువిప్పకపోవడం సరికాదని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదని తుషార్ మెహతా అన్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియాలో కుట్రలు వెలికి తీయాలంటే చిదంబరంను ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని తుషార్ మెహతా కోరారు. ఐఎన్ఎక్స్ మీడియాలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని వాదించిన తుషార్ మెహతా… ఈ విషయాలన్నీ బయటకు రావాలంటే చిదంబరంను మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

*చిదంబరంను అన్యాయంగా ఇరికిస్తున్నారు: కపిల్ సిబల్.*

ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ నుంచి అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చింది ఆరుగురు సెక్రటరీలని వారిని అరెస్టు ఎందుకు చేయలేదని వారి సలహామేరకు నడుచుకున్న చిదంబరంను ఎలా అరెస్టు చేస్తారని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఉదయం 11 గంటల వరకు సీబీఐ చిదంబరంను ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సీబీఐ చేసే ఆరోపణల్లో నిజం లేదని కపిల్ సిబల్ అన్నారు. ఐదురోజుల పాటు కస్టడీ దేనికని కపిల్ సిబల్ సీబీఐని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు బెయిల్ పై ఉన్నారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబల్. చేయని తప్పును ఒప్పుకోకపోవడం అంటే సహకరించడం లేదని చెప్పడం సరికాదన్నారు కపిల్ సిబల్.

*మాట్లాడేందుకు అనుమతి కోరిన చిదంబరం.*

ఇక వాదనలు జరుగుతున్న సమయంలో తనను మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా జడ్జినీ కోరారు చిదంబరం. అయితే ఇందుకు అభ్యంతరం తెలిపారు సాల్సిటర్ జనరల్. చిదంబరం మాట్లాడేందుకు అనుమతి ఇవ్వారాదని జడ్జీని తుషార్ మెహతా అభ్యర్థించారు. ఇదిలా ఉంటే తన క్లయింట్‌ను ఎందుకు మాట్లాడనివ్వరని ప్రశ్నించారు చిదంబరం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. దీంతో చిదంబరం మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తనపై ఆరోపణలు వస్తున్నట్లుగా ఐదు మిలియన్ డాలర్లకు తనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు చిదంబరం. అదే సమయంలో సీబీఐ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ తన కొడుకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అడిగిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వారడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్లు చిదంబరం కోర్టుకు తెలిపారు.

About The Author