దేశంలోనే తొలి వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభం…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల కాలంలో ఈ సెంటర్‌లో రూ.1వేయి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌లపై పరిశోధనలు చేయనున్నారు. ఈ సెంటర్‌లో ప్రధానంగా 3 ల్యాబ్‌లు ఉంటాయి. ఒక దాంట్లో కెమెరాలు, మరొక దాంట్లో కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్కింగ్, ఇంకో దాంట్లో ఆటోమేషన్ రంగాలకు చెందిన నూతన ప్రొడక్ట్స్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా కెమెరా డెవలప్‌మెంట్, 5జీ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్, ఏఐ ప్రొడక్ట్స్ టెస్టింగ్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. అలాగే నెట్‌వర్క్, ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత యాప్స్ డెవలప్‌మెంట్‌పై కూడా దృష్టి సారించనున్నారు. కాగా ఈ సెంటర్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని వన్‌ప్లస్ వ్యవస్థాపక సీఈవో పీట్ లౌ తెలిపారు.