వ్యయసాయంలో పందిరిసాగు..!
రూ.2.10 లక్షలు సబ్సిడీకి వీరు అర్హులు
రైతులకు కూరగాయల పంటలు సాగు చేసే దిశగా ప్రోత్సహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతులకు కూరగాయల సాగు దిశగా అడుగులు వేయించేందుకు భారీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.
• రైతులకు సాగు ప్రోత్సాహకాలు…
జిల్లాలలో ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతులు కేవలం 100 నుంచి 150 ఎకరాల్లో మాత్రమే కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. దీన్ని మరింతగా పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రైతులకు సబ్సిడీలు సైతం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే జనాభా అవసరాలకు సరిపడే స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఇప్పటి వరకు పట్టణాలు, ఆయా గ్రామాల్లో జరుగుతున్న సంతలలో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కూరగాయలనే విక్రయిస్తున్నారు. జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పెట్టుబడి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది రైతులు ఇతర పంటల సాగుపైన దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి ఎస్సీ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. కార్పొరేషన్ అధికారులు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనున్నది. తాము పండించిన కూరగాయలను జిల్లాలోని పలు మార్కెట్‌లలో విక్రయించడంతో పాటు మంచి ఆదాయం కూడా సమకూరే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధానికి తరలించేందుకు సైతం రైతులకు రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది.
• రాయితీలు ఇవే…!
కూరగాయల సాగు అనగానే చాలా మంది రైతులు చెట్ల సాగుపైనే మొగ్గు చూపుతారు. అయితే దీనికి భిన్నంగా శాశ్వత పందిరి విధానంలో కూరగాయల సాగు చేసే దిశగా అన్నదాతలను ఆకర్శించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కూడా పందిరిసాగు అంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అందుకోసం కడీలు, తీగలు ఏర్పాటు చేయాలి. మధ్యలో బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. వీటితో పాటు సాగుకు పెట్టుబడి ఖర్చులూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఎకరాకు సుమారు రూ.3.50 లక్షల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. సంబంధిత పెట్టుబడిలో రాయితీ కింద రైతులకు రూ.2.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా రూ.1.40 లక్షలు బ్యాంకు రుణంగా అందనున్నది.
• అర్హులు…
* రైతులు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి.
* కనీసం అర ఎకరమైనా వ్యవసాయ భూమి కలిగి నీటి వసతి తప్పనిసరి.
• దరఖాస్తు ఇలా..!
* ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోనే దరఖాస్తుల స్వీకరణ
* ఆసక్తి ఉన్న ఎస్సీ రైతులు కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.
* నెలాఖరులోగా దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు.
* ఆదాయం, కుల, నివాస ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ప్రతులు కూడా జత చేయాలి.