ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు…
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 6,975 చ.అడుగుల (16 సెంట్లు) స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌ||శ్రీదేవేంద్ర ఫడ్నవీస్ ముంబయిలోని తన అధికార నివాసంలో స్థలం కేటాయింపు ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీపి.బసంత్‌కుమార్‌కు అందజేశారు.
దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో స్థలం కోసం చాలాకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు బాంద్రాలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం అనుభవ ఉత్తర్వులను ముంబయి సబర్బన్ జిల్లా కలెక్టర్ శ్రీ మిలింద్ బోరికర్ టిటిడి జెఈవోకు అందజేశారు. ఈ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు సమాచార కేంద్రాన్ని టిటిడి నిర్మించనుంది.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ సుధీర్ ముంగటివార్, టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారధి, డెప్యూటీ ఈవో శ్రీ విశ్వనాథ్, స్థానిక సలహా మండలి సభ్యులు శ్రీవి.రంగనాథన్, డా.గీతా కస్తూరి, శ్రీ సమీర్ కె.మెహెతా తదితరులు పాల్గొన్నారు.