తల్లీకూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వఉద్యోగాలు…
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్ సక్సెస్ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు.
పెద్ద కుటుంబంలో చిన్న కోడలు
పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్‌లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ.
అమ్మతో పోటీ పడిన కూతురు
తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్‌సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్‌ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది.
ఇంట్లో స్నేహితులం
తల్లీ కూతుళ్లుగా బంధం నిర్ణయించినప్పటికీ ఇంట్లో ఇద్దరం మంచి స్నేహితులం. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాం. ‘ఇవి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు’ అని అమ్మ అనదు, ‘ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం’ అని నేను అనుకోను. చదువు, ప్రిపరేషన్ గురించే కాదు ఇంటి పనుల్లోనూ పక్కా ప్లానింగ్‌తో చేసేవాళ్లం. మా చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో రూపొందించుకున్న టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటాం. అదృష్ట్టవశాత్తు ఇద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం చాలా సంతోషాన్నిస్తోంది. మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది అలేఖ్య.
తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేశ్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించాడు. ఈ వయసులో చదువెందుకు అని ప్రశ్నించిన వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూనే ఉన్నత విద్య విషయంలో రాజీ పడలేదు. అందుకే తాము సాధించిన ఈ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రమేశ్‌కే దక్కుతుందని తల్లీ కూతుళ్లిద్దరూ ఆనందంగా చెబుతారు…