సావిత్రి రూ.2 వేలు పెట్టి వెళ్లింది…నా కళ్లు చెమ్మగిల్లాయి: గుమ్మడి వెంకటేశ్వరరావు


సావిత్రి లాంటి మహా నటి మళ్లీ పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుందని ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఓ సందర్భంలో అన్నారు. ఆమె తనను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. సావిత్రి జీవితం అందరికీ ఓ గుణపాఠమని పేర్కొన్నారు.

‘సావిత్రి, సూర్యకాంతం నన్ను అన్నయ్య అనేవారు. సావిత్రి పడ్డ కష్టాల్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వీటిలో ఓ చేదు అనుభవం ఆమె చివరి రోజుల్లో.. నాకు అనారోగ్యం చేసింది. అప్పుడు నన్ను చూడటానికి సావిత్రి వచ్చింది. నేను మత్తులో ఉన్నా. ‘ఎలా ఉన్నావ్‌ అన్నయ్య’ అంది. బావున్నా అని చెప్పా. నా తలగడ సర్ది, వెళ్లినట్లు అనిపించింది. దాని కింద చూస్తే రూ.2 వేలు ఉంది. తనే పెట్టి వెళ్లింది. నేను ఫోన్‌ చేశా.. ఏంటమ్మా డబ్బు పెట్టి వెళ్లావ్‌ అని అడిగా. ‘ఓసారి మీ దగ్గర తీసుకున్నా అన్నయ్య. మర్చిపోయారా.. నేను ఎవరికీ అప్పుపడి ఉండకూడదు. నిన్నే

వడ్డీ వాళ్లు వచ్చి రూ.5 వేలు ఇచ్చారు. అందులో రూ.2 వేలు తీసుకుని వచ్చా’ అంది. నాకు కళ్లు చెమ్మగిల్లాయి.

సావిత్రి తారగా తెగిపోయిన తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. ఏదో సినిమాలో తల్లి పాత్ర చేస్తున్నారు. అందరికీ మామూలుగా ఇంటి నుంచి భోజనం వస్తుంది. మాకు వచ్చాయి.. ఆమెకు ఇంటి నుంచి తీసుకొచ్చేవాళ్లు లేరు. సావిత్రి దూరంగా ఒక్కట్టే కూర్చొని ఉంది. నేను వెళ్లి రామ్మా.. భోజనం చేద్దాం అన్నా. ‘వద్దు అన్నయ్య అంది’. నువ్వు వస్తే కానీ నేను తినను అన్నాను. అప్పుడు కళ్లల్లో నీరు పెట్టుకుని వచ్చి, భోజనం చేసింది’.

‘‘సావిత్రి నా సినిమాలో ఉంటే చాలు’ అనుకున్న రోజులవి.అనంతరం ఆ స్థాయి నుంచి తగ్గగానే ప్రొడక్షన్‌ బాయ్స్‌ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆర్టిస్టుల జీవితాల్లో ఇది విషాదకరమైంది. సావిత్రికి ఉన్న ఆస్తులు ఇప్పుడు వందల కోట్లు విలువ చేస్తాయి. అలాంటిది ఆమె ఓ గ్యారేజీలో తన చివరి క్షణాల్ని గడిపారు. ఒకరకంగా సావిత్రి జీవితం అందరికీ గుణపాఠం. ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆమె వల్ల ఏ రోజూ, ఎవరూ ఇబ్బంది పడలేదు. చిన్నవారిని కూడా గౌరవించి మాట్లాడేది. అలాంటి అమ్మాయికి అలా జరిగింది. సావిత్రి లాంటి నటి పుట్టాలంటే ఓ శతాబ్దం పడుతుంది’ అని గుమ్మడి గుర్తుచేసుకున్నారు.

About The Author