కేసీఆర్ పై కోదండరాం ఫైర్…


హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రొఫెసర్ సారూ గరమయ్యారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడి హోదాలో మాటల తూటాలు సంధించారు కోదండరాం. ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించినోళ్లే ఇవాళ కేసీఆర్‌కు మిత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన కోదండరాం పలు అంశాలను ప్రస్తావించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్ సొత్తు కాదని, ఇది ప్రజలందరి తెలంగాణ అంటూ ముఖ్యమంత్రికి చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి కోసం మరో ఉద్యమం తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజల బతుకులు మారుతాయనుకుంటే.. కేసీఆర్ లైఫ్ స్టైల్ మారిందన్నారు. ప్రగతి భవన్‌లో నివాసం ఉంటూ ఆనాటి ఉద్యమ ద్రోహులకు ఎంట్రీ ఇస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని.. తెలంగాణపై ఆయన ఒక్కరికే హక్కు ఉన్నట్లు ప్రవర్తించడం సరికాదన్నారు. పాలకుల దోపిడీ తత్వాన్ని ప్రశ్నించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పదవుల మీద ఆశలు లేవని.. మంత్రి పదవి అవసరం లేదని.. రాష్ట్రాభివృద్ది ఎజెండాగా పనిచేస్తానంటూ చెప్పుకొచ్చారు.

About The Author