పాకిస్థాన్లో మళ్లీ హిందూ అమ్మాయి హత్య…


పాకిస్థాన్లో మళ్లీ హిందూ అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సిక్కు మతంకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి వివాహం చేసిన ఘటన మరువకముందే మరో హిందూ యువతిని హత్యచేసిన ఘటన వెలుగు చూసింది. మృతదేహం హాస్టల్ గదిలో కనిపించింది.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం…

మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నమ్రితా చాందిని అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో పడిఉండటం కనిపించింది. ఆ సమయంలో తన గొంతుకు ఏదో బట్ట కట్టి ఉన్నట్లుగా ఉంది. ఆమె గది కూడా లోపల నుంచి తాళం వేసి ఉంచారు. అయితే ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేశారు.కానీ నమ్రితా కుటుంబసభ్యులు మాత్రం తన బిడ్డది ముమ్మాటికీ హత్యే అని చెబుతున్నారు. స్వయంగా డాక్టర్ అయిన నమ్రితా సోదరుడు విశాల్, ఆమెను పరీక్షించి అది హత్యే అని ప్రాథమిక అంచనాకు వచ్చాడు.

మృతిపై తలెత్తుతున్న అనుమానాలు…

ఈ మధ్యే గోట్కీ ప్రాంతంలో ఓ ఆలయంను ధ్వంసం చేశారు కొందరు. ఇక మృతి చెందిన నమ్రితా కూడా ఈ ప్రాంతంకు చెందినదే. ఓ కాలేజీకి చెందిన హిందూ మైనార్టీ ప్రిన్సిపల్ మరో సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఆలయంను ధ్వంసం చేశారు. అయితే నమ్రిత మృతి విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. బలవంతంగా మతం మార్పిడికి పాల్పడే క్రమంలో ఆమెపై అత్యాచారం చేశారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

ఏటా వెయ్యి మంది యువతుల బలవంతపు మత మార్పిడి…

ఏటా సింధు ప్రావిన్స్‌లో నివసిస్తున్న 12 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఏటా వెయ్యిమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు. పాకిస్తాన్ మానవహక్కుల నివేదిక ప్రకారం 2004 నుంచి 2018 వరకు ఒక్క సింధు ప్రాంతంనుంచే ఇలాంటివి 7,430 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారిక సమాచారం మాత్రమే. ఇంకా లెక్కలోకి రాని కేసులు ఎన్నో ఉన్నాయి.

About The Author