మా అత్త గారిని చంపడం ఎలా?


ఆ ఇరవై నాలుగేళ్ళ యువతి ఒక సాధువు దగ్గరకు వెళ్ళింది. ఆయనతో ఇలా అన్నది : ” మా అత్త గారితో వేగలేక పోతున్నాను. ప్రతిదానికి ఆమె అడ్డు తగులుతోంది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాను. ఒక ఉపాయం చెప్పండి .” ఆయన కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు : ” అమ్మాయి , ఇదిగో ఈ పొడి తీసుకో. దీన్ని కొంచెం కొంచెంగా టీ లో కలిపి మీ అత్తగారితో త్రాగించు. ఇది నెమ్మదిగా పనిచేస్తుంది. దీని ప్రభావంతో రెండు నెలలకు మీ అత్త గారు చనిపోతారు. కానీ , ఇదొక విచిత్రమైన మందు. దీన్ని ఇచ్చేటప్పుడు , ఇచ్చినతరువాత అవతలి వ్యక్తి తో నీవు చాలా ప్రేమగా మాట్లాడాలి , వాళ్ళు ఏమన్నా , అనకపోయినా చాలా ఓపికగా వుండాలి. నిస్వార్థంగా వాళ్ళను సేవిస్తూ వుండాలి. లేదంటే ఇది పని చేయదు. అంతే కాదు , మీరు ప్రేమతో మందు ఇస్తుంటే ఆమె చనిపోయినా మిమ్మలను ఎవరూ అనుమానించరు. ” అలానే చేస్తానని చెప్పి సంతోషంగా మందు తీసుకుని వెళ్ళిపోయింది కొత్త కోడలు. కానీ , నెలరోజులు కూడా కాకంటే ముందే మళ్ళీ వచ్చి , ” స్వామీ , దయచేసి ఈ మందు వాపసు తీసుకోండి. మా అత్త గారిలో ఎంతో మార్పు వచ్చింది. మా అత్త గారు చనిపోవడం నాకు ఇస్టం లేదు. ఇపుడు ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నేనంటే అమెకు ఇపుడు ఎంతో ఇస్టం. నాకు కూడా ఇపుడు ఎంతో హాయిగా , సంతోషంగా వుంది. ఆమెకు ఏ ప్రమాదమూ రాకూడదు అని కోరుకుంటున్నాను , ఇదిగో ఈ మందు వాపసు తీసుకోండి. కానీ ఒక ఇరవై రోజులదాకా ఇచ్చానే , ఆమెకు ప్రమాదం రాదా ? ” అని భయంగా అడిగింది. అందుకు ఆ సాధువు చిన్నగా నవ్వుతూ , ” నీవు భయపడాల్సిన పని లేదు. అది విషం కాదు. ఇంకా ఆరోగ్యమిచ్చే మందు. నీకు నమ్మకం కలగాలనే దీన్ని ఇచ్చాను. నిజానికి మీ అత్త గారిని మార్చింది నా మందు కాదు, నీవు చూపిన ప్రేమ , ” అన్నాడు.

పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాక కూడా మనకు ఈ రోజుకు కూడా నిజమైన ప్రేమ అంటే తెలియదు. ఒక చోట నేను క్లాస్ లో నుండి బయటికి వచ్చాక , ఒక పెద్దాయన ‘ నీవు క్లాస్ లో ప్రేమ గురించి చెప్పావట కదా ? ” అన్నాడు. ప్రేమ గురించి కాక ద్వేషం గురించి చెప్పాలా ? ప్రేమ గురించి చెప్పకుండా పోయిన కారణంగానే ఈ ప్రపంచం నిండా ద్వేషాలు , యుద్ధ్హాలు , పగలు , ప్రతీకారాలు. తల్లి తండ్రులకు అన్నం పెట్టని బిడ్డలు , అత్తలను చంపే కోడళ్లు , కోడళ్ళను రాచి రంపాన పెట్టే అత్తలు , ఒకరినొకరు మోసం చేసుకునే అన్నదమ్ములు ! కాదా ? ప్రేమ అనగానే మనకు ‘ రొమాన్స్ , హనీమూన్ లు గుర్తుకొస్తూన్నాయంటే అది ప్రేమ తప్పు కాదు , మన ఆలోచనల తప్పు. నిజమైన ప్రేమ ఒక క్షణంలో అకస్మాత్తుగా పుట్టేది కాదు. అట్లాంటిది ప్రేమ కాదు , ఆకర్షణ. నిజమైన ప్రేమ నెమ్మది గా , ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ కట్టిన భవనం లాగా ఏర్పడుతుంది. తల్లి కి బిడ్డ పట్ల వుండేది ఆకర్షణ అవుతుందా ? ఆమె బిడ్డను తన కడుపులో ప్రతి క్షణం పెంచుకుంటూ , నెమ్మదిగా , అపురూపంగా కాపాడుకుంటూ వచ్చింది. అవునా ?

About The Author