ప్రభుత్వ వైద్యుల కి షాక్ – ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం…


ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌కు.. నివేదికలోని అంశాలను సుజాతారావు వివరించారు. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని పలు లోపాలను కూడా కమిటీ బయటపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సు ఏదైనా సరే.. చివరి ఏడాది వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని.. అప్రెంటిస్‌ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని..ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీకి సూచించారు. ఆయన కొనసాగిస్తూ… ‘ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్‌షీట్లు, బాత్‌రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందని సంబంధిత అధికారులతో పేర్కొన్నారు.

సమీక్ష సమావేశంలో కొన్ని సీఎం జగన్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు

హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్‌ 1 నుంచి ప్రారంభం

డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం

ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు

జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు

పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజక్ట్‌ అమలు

మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు

వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు

లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక

ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం

ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం

కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల పెన్షన్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికి కూడా నెలకు రూ. 5వేలు ఇవ్వాలని..ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు

About The Author