13 ఏళ్ల తర్వాత కన్న ఒడికి మానసిక వికలాంగ బిడ్డ…
టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమం తప్పిపోయిన బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిప్రకారం.. రెండున్నరేళ్ల క్రితం 13 ఏళ్ల వయసు గల మానసిక దివ్యాంగుడైన బాలుడు తప్పిపోయాడు. కుమారుడ్ని వెతికేందుకు తల్లిదండ్రులు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఫలితం లేదు.
ఇటీవల బాలుడి తల్లిదండ్రులు ‘దూరదర్శన్ కోల్‌కత’ ఛానెల్‌లో వార్తలు చూస్తుండగా తమ కుమారుడు అందులో కనిపించాడు. మానసిక వికలాంగులైన అనాథ బాలలకు ఆశ్రయం కల్పించే గృహం గురించి ఆ ఛానెల్‌లో ప్రసారం చేశారు. వెంటనే బాలుడి తండ్రి కార్తీక్ షా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దూర్‌దర్శన్ కేంద్రాన్ని సంప్రదించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు.
పశ్చిమబంగాల్‌లోని నదియా జిల్లా నకషిపారా ప్రాంతంలో మానసిక దివ్యాంగులైన అనాథ బాలలను ఆదరించే గృహం ఉంది. దీన్ని ప్రభుత్వోద్యోగి అయిన మోస్లెమ్ మున్షీ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఇందులోనే బాలుడు ఆవాసం పొందుతున్నాడు. ‘‘బాలుడి తల్లిదండ్రులు ఆదివారం నన్ను కలిశారు. చాలా కాలం తర్వాత తమ కుమారుడ్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు’’ అని మున్షీ అన్నారు.
2017 ఫిబ్రవరిలో ఉత్తర కోల్‌కతలోని తన నివాసం వద్ద బాలుడు కనిపించకుండా పోయాడు. కొద్ది నెలల తర్వాత నదియా జిల్లాలో బాలుడ్ని జిల్లా యంత్రాంగం చేరదీసి కొన్నాళ్లు ప్రభుత్వ అనాథ గృహంలో ఉంచారు. తర్వాత మానసిక దివ్యాంగుల గృహంలోకి చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది.