యువతిపై గ్యాంగ్ రేప్ జిల్లా జైలు వెనుక దారుణం
నిజామాబాద్:అతడికి పెళ్లయి పిల్లలున్నారు! ఆ విషయాన్ని దాచి ఒక యువతిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై తన స్నేహితులను పిలిపించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పాడు. ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ఆ దారుణాన్ని వీడియో తీశారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిందీ ఘోరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి (24) నిజామాబాద్ నగర శివారులోని ఓ పల్లెటూరులో నివాసం ఉంటోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో తమ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఏడాది క్రితం పనిలో చేరింది. రాకపోకలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలోనే పనికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు.. ఆటో నడిపే సురేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి జరిగి.. అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నా.. సురేశ్ ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా ప్రేమ నటించాడు. రోజూ ఆమెను ఆటోలో దిగబట్టే వంకతో చనువు పెంచుకున్నాడు. సురేశ్ దురుద్దేశం తెలియని ఆమె.. అతణ్ని పూర్తిగా నమ్మింది. అనువైన సమయం కోసం ఎదురుచూసిన సురేశ్.. సారంగాపూర్ హనుమాన్ ఆలయానికి వెళ్దామని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం ఆమెను ఆటోలో ఎక్కించుకుని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.అక్కడ ఉన్న జిల్లా జైలు వెనుక భాగంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.తన స్నేహితులు మరో ఆరుగురిని కూడా అక్కడికి రప్పించాడు. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని మరో ఇద్దరు యువకులు తమ మొబైల్‌ఫోన్లలో వీడియో తీశారు.ఇలా దొరికిపోయారు..యువతిపై సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసిన ఇద్దరు యువకులూ.. జైలు పరిసర ప్రాంతంలో తమ ఆటో నిలిపి ఉంచి ఆ వీడియోను చూడసాగారు. సరిగ్గా అదే సమయంలో నిజామాబాద్ నగర 6వ పట్టణ పోలీసులు ఓ కేసు నిమిత్తమై అటుగా వెళ్లారు. అటవీ ప్రాంతం మధ్యలో నిలిపి ఉంచిన ఆటోను గమనించారు. ఆటోలో ఉన్న ఇద్దరు యువకులను ప్రశ్నించగా.. వారు భయంగా, కంగారుగా పొంతనలేని సమాధానాలిచ్చారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా.. జరిగిన దారుణం గురించి బయటపెట్టారు. తాము అత్యాచారం చేయలేదని.. వీడియో మాత్రమే తీశామని బావురుమన్నారు. పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సదరు యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తనపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఆమె పోలీసులకు వివరించింది. పోలీసులకు చిక్కిన ఇద్దరు వీడియో మాత్రమే తీశారని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.నిందితులుసారంగాపూర్‌వాసులే….సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ యువకులు సారంగపూర్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తేల్చారు. వారంతా పరారీలో ఉన్నారు. వారి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.