శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టిటిడి ఛైర్మన్
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభం కానుండడంతో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి కలిసి శనివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.
టిటిడి అధికారులు శనివారం తాడేపల్లిలోని గౌ..ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిశారు. సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గౌ..ముఖ్యమంత్రి వర్యులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బ్రహ్మోత్సవాల వాహనసేవలు, గరుడసేవ ఏర్పాట్లను గౌ|| ముఖ్య మంత్రికి తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున టిటిడి అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఎలాంటి రాజీకి తావు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబరు 30వ తేదీ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మన్, ఈవో అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.