రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభం…
నల్లగొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ గారు తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. బతుకమ్మ చీరెల తయారీతో సిరిసిల్లలో నేత కార్మికుల జీవనోపాధికి ఒక భరోసా దొరికిందన్నారు.
ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం పథకాలు తీసుకురాలేదు. చేనేత మిత్ర పేరుతో రాష్ట్రంలో నేతన్నలందరికీ భరోసానిచ్చే విధంగా రసాయనాలు, నూలు, అద్దకానికి వాడే వస్తువులను 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం. నేతన్న చేయూత పేరిట నేతన్నల కుటుంబాల కోసం మరో పథకం అమలు చేస్తున్నాం. చేనేత లక్ష్మీ పేరిట మరో కార్యక్రమం తీసుకువచ్చాం. వరంగల్‌లో అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును తీసుకువస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ రమావత్ రవీంద్ర నాయక్, శ్రీ చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ శ్రీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ ఛైర్మన్ శ్రీ బండా నరేందర్ రెడ్డి మరియు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.