వేణుమాధవ్ కు మంత్రి ఆర్థిక సహాయం….
హాస్యనటుడు వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఇరవై రోజులుగా యశోద వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే వేణుమాధవ్ మరణించారు.
వేణుమాధవ్ మృతి వార్త విని పలువురు సినీ ప్రముఖులు, సహచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. యశోద ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు వేణుమాధవ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వేణుమాధవ్ తమ్ముడు లాంటి వాడని, ఇంత చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరమని తలసాని దిగ్భ్రాంతి చెందారు.
హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
వేణుమాధవ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ తెలుసని మంత్రి తెలిపారు. తను ఎక్కడున్నా అందరినీ నవ్వించేవాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తన టాలెంట్‌తో ఈ స్థాయికి చేరాడన్నారు. సుమారు 600 చిత్రాల్లో నటించాడని, నంది అవార్డులు తీసుకున్నాడన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆస్పత్రి బిల్లును మంత్రి చెల్లించారు. ఆర్థిక పరమైన విషయాలను పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. అలాగే అంత్యక్రియలకు కూడా రూ.2 లక్షలు సాయం ప్రకటించినట్లు సమాచారం.