మిషన్ భగీరథకు జాతీయ జల మిషన్ అవార్డు…
జాతీయ జల మిషన్ అవార్డును మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి అందుకున్నారు. ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా ఈ.ఎన్.సి అవార్డు తీసుకున్నారు. తెలంగాణ ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన దైవకార్యం మిషన్ భగీరథకు ఇప్పటికే హడ్కో, స్కోచ్ లాంటి జాతీయ అవార్డులు దక్కాయన్నారు కృపాకర్ రెడ్డి. తాజాగా ఈ జలమిషన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, తమ శాఖ ఇంజనీర్ల కఠోర శ్రమతోనే ఇవాళ మిషన్ భగీరథ ప్రాజెక్టు విజయవంతం అయిందన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మిషన్ భగీరథతో స్పూర్తితోనే కేంద్రం కూడా హర్ ఘర్ నల్ సే జల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతుందన్నారు. అంతకుముందు ఢిల్లీలో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్టాల్ ను కేంద్రమంత్రి షెకావత్ ప్రారంభించారు. భగీరథ ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.