హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు…


హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించిన మంత్రులు శ్రీ శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీ వినయ్‌ భాస్కర్‌, జెడ్పీ చైర్మన్‌ శ్రీ సుధీర్‌ కుమార్‌, మహిళా కార్పోరేషన్‌ చైర్మన్‌ శ్రీమతి గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలు అత్యంత ఇష్టంగా ఆడుకునే ఈ పండుగలో మహిళా మంత్రిగా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈజిల్లాలో పుట్టిన బిడ్డగా నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ముఖ్య పండగ గా బతుకమ్మ పండుగ నేడు అధికారికంగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పండుగలో రాష్ట్ర ఆడపడుచులు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు గత మూడేళ్ళుగా బతుకమ్మ చీరలు అందిస్తున్నారని తెలిపారు.
పండగకు మహిళలకు చీరలు అందించడం వల్ల వీరికి సంతోషంతో పాటు నేతన్నలకు ఉపాధి కూడా అందుతోంది అన్నారు. అందుకే బతుకమ్మ పండుగ బతుకును ఇచ్చే పండగ అని, బతుకు నేర్పే పండగ అని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభివర్ణించారు.

బతుకమ్మ పండుగను కాకతీయులు పాలించిన వరంగల్ వేయి స్తంభాల గుడి వేదికగా అధికారికంగా ప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ దీవెనలు శ్రీరామ రక్ష అని, రాష్ట్ర ప్రగతికి ఆశీర్వాదం అన్నారు. తెలంగాణ బతుకమ్మ పండుగ ను మనతో పాటు నేడు విదేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారని, దీనికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కారణమని మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బతుకమ్మ పండుగ చేసుకునే మహిళలు కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా పండగ జరుపుకోవాలనే గొప్ప ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చీరల పంపిణీ చేశారన్నారు

About The Author