ఎర్ర చందనం దుంగలతో తమిళ స్మగ్లర్ అరెస్టు
తొమ్మిది ఎర్ర చందనం దుంగలతో పాటు ఒక తమిళ స్మగ్లర్ ను ఆర్ ఎస్ ఐ విజయ్ ఎఫ్ బిఒ జానీ బాషాలతో కూడుకున్న టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. ఈ బృందం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య సూచనల తో టీమ్ ఇంచార్జ్ ఆర్ ఐ మురళీ పథకాన్ని అనుసరిస్తూ ఆదివారం సాయంత్రం నుంచి కల్యాణి డామ్ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. వీరు సోమవారం తెల్లవారు జామున పుల్లయ్యగారి పల్లి చెరువు వద్ద వెళుతుండగా పది మంది స్మగ్లర్లు ఎదురయ్యారు. చీకటిలో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించు కున్నారు. వెళుతూ తొమ్మిది దుంగలను పడేసి పారిపోయారు. వారిని వెంబడించగా ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు. ఇతనిని తమిళనాడు విల్లుపురం జిల్లా శంగరాపురం తాలూకా వెంగడం గ్రామానికి చెందిన బాలక్రిష్ణ (30) గా గుర్తించారు. సంఘటన స్థలానికి ఎసిఎఫ్ కృష్ణయ్య, డిఎన్ కె ప్రసాద్ చేరుకున్నారు. విజయ్ బృందాన్ని టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.