ఏపీ కి కిక్కు కటింగ్‌

అమరావతి:మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వంరూ.20 నుంచి రూ.80 వరకు బాదుడుఎమ్మార్పీపై అదనపు రేటుకు ఏఆర్‌ఈటీ పేరుబీరుపై రూ.20.. అన్ని బ్రాండ్లకూ వర్తింపు.చీప్‌’ వినియోగదారులకు చుక్కలు,ఇక రోజూ 8 గంటలే మద్యంసర్కారీ మద్యం నేటి నుంచే

అమరావతి,మద్యంపై సర్కారు ధరల మోత మోగించింది. మంగళవారం నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఒకేసారి ధరలు పెంచేసింది. బ్రాండ్లతో సంబంధం లేకుండా అన్ని రకాల మద్యంపై సీసాల పరిమాణం ఆధారంగా ధరలు పెంచింది. ఖరీదైన మద్యంపైనా, చీప్‌పైనా ఒకే పెంపు కావడం వల్ల పేదలు, సామాన్యులు మందుకు అధిక ధరలకు వెచ్చించే పరిస్థితి ఏర్పడనుంది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(ఐఎంఎ్‌ఫఎల్‌)లో క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌ బాటిల్‌పై రూ.80 పెంచేసింది. ఫారిన్‌ లిక్కర్‌లో పరిమాణాల వారీగా రూ.10 నుంచి రూ.250 వరకూ పెంచింది. బీరుపై రూ.20, చిన్న బీరుపై రూ.10 పెంచింది. రెడీ టు డ్రింక్స్‌పైనా ఒక్కో సీసాపై రూ.20 పెంచింది. పెరిగిన ధరలు తొలిరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. మద్య నిషేధంలో భాగంగా ధరలు పెంచుతామని ముందుగా ప్రకటించినట్లుగానే ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది. అయితే ఇది పేదలపై పెద్ద భారంలా మారుతుందనే వాదన వినిపిస్తోంది. రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు చీప్‌ లిక్కర్‌ లేదా మోస్తరు ధరలుండే బ్రాండ్లనే తాగుతారు. వారిపై నేటినుంచి కనీసం రూ.20 అదనపు భారం పడనుంది. కాగా ఇప్పటివరకూ ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చిన 10శాతం మార్జిన్‌(లాభం)ను, ఇకపై ఎక్సైజ్‌కు 6శాతం, ఏపీఎ్‌సబీసీఎల్‌కు 4శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏపీఎ్‌సబీసీఎల్‌ షాపులను నిర్వహించబోతున్నందున ఆ కార్పొరేషన్‌కు 4శాతం అంటే సుమారు రూ.800కోట్లు వెళ్లే అవకాశం ఉంది.

కాగా కొత్తగా పెంచిన ధరలకు ప్రభుత్వం అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ) అనే పేరు పెట్టింది. ఇప్పటికే షాపులకు చేరిన మద్యంపై పాత ధరలే ముద్రించి ఉన్నాయి. కానీ పెరిగిన ధరల ప్రకారమే మద్యం అమ్ముతారు. ధరల పెంపు కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది.

8 గంటల వరకే మద్యం

మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మకాల సమయాన్ని గతంలోనే ఓ గంట కుదించగా, ఇప్పుడు మరో రెండు గంటలు తగ్గించింది. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అవకాశం ఉండగా, ఈ పాలసీలో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు మాత్రమేనని గతంలోని మార్గదర్శకాల్లో పేర్కొంది. కానీ నేటినుంచి పాలసీ రానున్న నేపథ్యంలో ఆ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటలుగా మార్చింది. సమయం తగ్గించడం వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని ఎక్సైజ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయం కేవలం షాపులకు మాత్రమే. బార్లకు యథావిధిగా ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలకు అవకాశముంది.

About The Author