తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన 10 మంది స్మగ్లర్లు
కడపజిల్లా:రైల్వేకోడూరు సమీపంలో బాలపల్లి బీట్ పరిధిలో ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న పది మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసు లు అరెస్టు చేశారు. వారి నుంచి 19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ అల్లా బక్ష్ సూచనలతో ఆర్ ఐ ఆలీబాషా, ఆర్ ఎస్ ఐ లక్షణ్ ల టీమ్ బాలపల్లి బీట్ లో మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. కానిస్టేబుల్స్ సుబ్బరాయుడు, నారాయణ లకు కొంత మంది స్మగ్లర్లు కుంజన ఫారెస్ట్ నుంచి కొండ దిగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ టీమ్ రామాపురం రైల్వే గేటు నుంచి కుంజన ఫారెస్ట్ లోకి వెళ్లారు. స్మగ్లర్లు దిగుతున్న మార్గంలో కాపు కాశారు. దాదాపు 25 మంది స్మగ్లర్లు బుధవారం తెల్లవారు జామున కొండ దిగుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారిలో కొంతమంది చీకటిలో పారిపోగా పది మందిని పట్టుకున్నారు. వీరిని తమిళనాడు ధర్మపురి జిల్లా కు చెందిన తీర్థం రాజారామ్ (42), ఆర్. వీరప్పన్ (30), పెరుమాళ్ శెల్వం (49), ఆండి మాదేష్ (28), నటరాజ్ గోవిందన్ (25), తంగవేల్ పెరుమాళ్ (29), చిన్నరామన్ పళని (40), ఆండి చిట్టి రాజ్ (25), ఆండి పెరుమాళ్ (34), వెలియన్ గణేశన్ (26) గా గుర్తించారు. వీరిని అరెస్టు చేశారు.
సంఘటనస్థలానికి టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు, డీఎస్పీ అల్లా బక్ష్, ఎసిఎఫ్ కృష్ణయ్య, సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు సిబ్బందిని అభినందించారు. ఈ టీమ్ లో ఎఫ్ ఎస్ ఒ బాలచంద్రుడు, గౌస్ బాషా ఉన్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.