బొంగు బాటిల్‌ను లాంచ్ చేసిన కేంద్రం
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి సింగిల్ యూస్ (ఒకసారి మాత్రమే వాడగలిగే) ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది కేంద్రం. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు. వాడకూడదు. నిల్వ చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ కోసమే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే ప్లాస్టిక్ బ్యాన్ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది కేంద్రం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖ (MSME) కింద పనిచేసే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖమంత్రి నితిన్ గడ్కరీ బొంగు బాటిల్‌ను లాంచ్ చేశారు. కేవీఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బాటిళ్లను తయారు చేశారు. ప్రకృతిలో పెరిగే ఈ బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పైగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 750 మిల్లీ లీటర్ల ఈ బాటిల్ ధర రూ.300. అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో వెదురు బాటిళ్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇక ప్లాస్టిక్ గ్లాసు స్థానంలో మట్టి గ్లాసులను తయారు చేస్తోంది KVIC. ఇప్పటికే కోటికి పైగా మట్టి గ్లాసులను తయారు చేశారు. ఈ ఏడాది చివరికల్లా కోటి నుంచి మూడు కోట్ల వెదురు బాటిళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూల వంటి ఉత్పత్తులను అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో అమ్ముతారు. ఇలాంటి వాటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.