చేతిరాత తల్లిఒడికి చేర్చింది…


ఏడేళ్ల వయసులో తప్పిపోయిన మూగ బాలుడిని 10 ఏళ్ళతరువాత చేతిరాత పట్టించింది.. తల్లి వద్దకు చేర్చింది. గంజాం జిల్లా దిగపొహండి సమీపాన తరుబుడి గ్రామానికి చెందిన షేక్‌ కమాల్‌, షహజబి దంపతుల ఏడేళ్ల మూగ బధిర కుమారుడు షేక్‌ బాబు 2009లో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆయన కోసం వివిధ చోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. కుమారునిపై బెంగతో షేక్‌ కమాల్‌ మృతిచెందాడు. ఆ బాలుడ్ని 2016లో బ్రహ్మపుర ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు స్థానిక రైల్వే స్టేషన్‌లో కాపాడారు. ఆయన తన వివరాలేవీ చెప్పలేకపోవడంతో సీడబ్ల్యుసీ ఆదేశాల మేరకు ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు ఆయనను గంజాం జిల్లా కొదలాలోని బాల వికాస్‌ ఆవాసిక కేంద్రానికి తరలించారు. ఆయన తన పేరు కూడా చెప్పలేకపోవడంతో కేంద్రం అధికారులు కాలియా అని పేరుపెట్టారు. 2018లో బాలునికి చదువు చెప్పడం ప్రారంభించారు. బాలుడు కుడివైపు నుంచి ఎడవవైపునకు రాయడంతో ముస్లిం కుటుంబానికి చెందినవాడై ఉంటాడని అనుమానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ముస్లిం వాడల్లో బాలుని వివరాలపై ఆరా తీస్తుండగా తురుబుడిలో నివాసముంటున్న ఆయన కుటుంబం గురించి తెలిసింది. బాలుడి తల్లి షహజబి, తురుబడి సర్పంచి, సమితి సభ్యుడు తదితరులు బాలుడ్ని గుర్తించారు. ఈమేరకు అధికారులు అన్ని వివరాలు నిర్ధారించుకున్న అనంతరం శుక్రవారం బాలుడ్ని బ్రహ్మపురలో సీడబ్ల్యుసీ కార్యాలయంలో ప్రతినిధుల సమక్షంలో ఆయనను తల్లికి అప్పగించారు. కుమారుడిపై ఆశలు వదులుకున్న ఆ తల్లి కుమారుడు తిరిగి తన ఒడికి చేరడంతో కన్నీటితో అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.

About The Author